బీజేపీ.. పేరు మార్చుకోవాలి

ABN , First Publish Date - 2022-10-03T08:04:11+05:30 IST

భారతీయ జనతాపార్టీపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ట్వీటర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు.

బీజేపీ.. పేరు మార్చుకోవాలి

  • ఈసీ, ఈడీ, సీబీఐ చెప్పాల్సిన విషయాలన్నీ ముందే చెప్పేస్తోంది
  • ‘బీజే ఈసీ సీబీఐ ఎన్‌ఐఏ ఐటీ ఈడీ పార్టీ’గా మార్చుకుంటే మేలు
  • కమలనాథులపై ఘాటైన ట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌ 
  • కేంద్రానికే తెలంగాణ డబ్బులిస్తోందని వ్యాఖ్య

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతాపార్టీపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ట్వీటర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. బీజేపీ తన పార్టీ పేరును మార్చుకోవాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఈనెల 15లోగా వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ పేర్కొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సునీల్‌ బన్సన్‌ చేసిన వ్యాఖ్యల మీడియా కథనాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ కోర్‌ కమిటీ సమావేశమైన నేపథ్యంలో కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించక ముందే బీజేపీ నేతలు ఎన్నికల తేదీలను ప్రకటిస్తున్నారు. ఈడీ కంటే ముందే సోదాలు చేసే వారి పేర్లను సైతం చెప్పేస్తున్నారు. ఎన్‌ఐఏ కంటే ముందే బ్యాన్‌ విధిస్తున్నారు. ఆదాయ పన్నుశాఖ కన్న ముందే పట్టుకున్న డబ్బుల వివరాలను చెప్పేస్తున్నారు. సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లను ప్రకటించేస్తున్నారు. బీజేపీ తన పార్టీ పేరును ‘బీజే ఈసీ సీబీఐ ఎన్‌ఐఏ ఐటీ ఈడీ పార్టీ’’ గా మార్చుకోవాలి’’ అని ఎద్దేవా చేశారు.


రూపాయి ఇస్తే.. తిరిగిచ్చేది 46 పైసలే! 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌పైనా కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ‘‘ఇస్తున్నదంతా మోదీ సర్కారే’’ అంటూ కేంద్ర మంత్రి నిర్మల వెళ్లిన ప్రతిచోటా ఉపన్యాసాలిస్తున్నారు. ఇవిగో వాస్తవాలు, లెక్కలు. దేశానికి తెలంగాణ చెల్లిస్తున్న ప్రతీ రూపాయిలో మాకు తిరిగివచ్చేది కేవలం 46 పైసలే. మేడమ్‌ ఇప్పుడు ఒక బ్యానర్‌ పెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రేషన్‌ దుకాణాల వద్ద ‘‘థ్యాంక్స్‌ టూ తెలంగాణ’’ అన్న బ్యానర్‌ను ఏర్పాటు చేయండి’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అలాగే 2014-15 నుంచి 2020-21 వరకు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి రూ.3,65,797 లక్షల కోట్లు ఇచ్చామని, అక్కడినుంచి తిరిగి కేవలం రూ.1,68,647 లక్షల కోట్లే వచ్చాయన్నారు.   ప్రతీ ఏడాది రాష్ట్రం నుంచి చెల్లించిన పన్నులు, అలాగే తిరిగి అక్కడి నుంచి వచ్చినవి, ఇంకెంత బ్యాలెన్స్‌ రావాల్సి ఉందో అన్న వివరాలతో కూడిన ఒక పట్టికను కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

Updated Date - 2022-10-03T08:04:11+05:30 IST