ఓటమి భయంతో దాడుల డ్రామా: బీజేపీపై అఖిలేష్ ఫైర్

ABN , First Publish Date - 2022-02-17T01:10:26+05:30 IST

బీజేపీ కార్యకర్తలపై ఎస్పీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారనేది అవాస్తవం. ఓటమి భయంతో వాళ్లకు వాళ్లే దాడులు చేసుకుని ఎస్పీపై తోయాలని చూస్తున్నారు. ఒకవేళ మా పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడినట్లైతే యోగి ప్రభుత్వం..

ఓటమి భయంతో దాడుల డ్రామా: బీజేపీపై అఖిలేష్ ఫైర్

లఖ్‌నవూ: తమ పార్టీ కార్యకర్తలపై సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు దాడి చేశారంటూ భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన ఆరోపణలు ఓటమి ఆడుతున్న డ్రామా అని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమకు తామే దాడులు చేసుకుని ఎస్పీపై తోస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


‘‘బీజేపీ కార్యకర్తలపై ఎస్పీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారనేది అవాస్తవం. ఓటమి భయంతో వాళ్లకు వాళ్లే దాడులు చేసుకుని ఎస్పీపై తోయాలని చూస్తున్నారు. ఒకవేళ మా పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడినట్లైతే యోగి ప్రభుత్వం ఏం చేస్తోంది? అసలు యూపీలో శాంతి భద్రతలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? శాంతి భద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది?’’ అని అఖిలేష్ ప్రశ్నించారు.


ఇక దేశాన్ని బీజేపీ లూటీ చేస్తుందని, బీజేపీ వచ్చాకే బ్యాంకులు దివాలా తీశాయని అఖిలేష్ విమర్శించారు. ‘‘గుజరాత్ వ్యాపారవేత్తలు బ్యాంకులను లూటీ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఎక్కువయ్యాయి. మూడో కంటికి తెలియకుండా ప్రభుత్వ సంస్థల్ని అమ్మేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఇవి ఆగవు. బీజేపీని అధికారం నుంచి దించేస్తేనే దేశం బాగుపడుతుంది. ఇప్పటికే దేశం చాలా నష్టపోయింది. ఇది కొనసాగొద్దంటే బీజేపీని గద్దె దించాలని ప్రజలు కూడా అనుకుంటున్నారు’’ అని అఖిలేష్ అన్నారు.

Updated Date - 2022-02-17T01:10:26+05:30 IST