AIADMKతో పెరుగుతోన్న దూరం.. Sasikalaకు BJP ఆహ్వానం

ABN , First Publish Date - 2022-06-02T18:18:06+05:30 IST

అన్నాడీఎంకే పార్టీకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా చేసిన శశికళ ప్రస్తుతం పార్టీలో లేరు. ఒకవేళ ఆ పార్టీ కనుక ఆమెను తిరిగి చేర్చుకోవడానికి ఇష్టపడకపోతే మేము ఆమెను బీజేపీలో చేరమని కోరుతున్నాం. మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆమె రాక తోడ్పడుతుంది..

AIADMKతో పెరుగుతోన్న దూరం.. Sasikalaకు BJP ఆహ్వానం

చెన్నై: తమిళనాడులో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)కి అన్నాడీఎంకే(AIADMK) పార్టీకి మధ్య దూరం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నాటి నుంచే ఈ దూరం పెరుగుతూ వస్తోందని రాజకీయ గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పుడు ఆ పార్టీ నేతలే బయటికి మాట్లాడే వరకు వచ్చింది. రాష్ట్రంలో డీఎంకే(DMK)తో ఎలాగూ ఇప్పట్లో పొత్తు కుదరదు, వేరే పార్టీ ఏదీ చెప్పుకునేంత బలంగా లేదు.. దీంతో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ(Sasikala)వైపు బీజేపీ మొగ్గు చూపుతోంది. ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నైనర్ నాగేంద్ర(Nainar Nagendran) వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.


బుధవారం రాష్ట్రంలోని పుడుకొట్టైలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే నాగేంద్రన్ మాట్లాడుతూ ‘‘అన్నాడీఎంకే పార్టీకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా చేసిన శశికళ ప్రస్తుతం పార్టీలో లేరు. ఒకవేళ ఆ పార్టీ కనుక ఆమెను తిరిగి చేర్చుకోవడానికి ఇష్టపడకపోతే మేము ఆమెను బీజేపీలో చేరమని కోరుతున్నాం. మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆమె రాక తోడ్పడుతుంది’’ అని అన్నారు. శశికళ తిరిగి అన్నాడీఎంలో చేరబోతోందని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అంతే కాకుండా అన్నాడీఎంకేలోని కొందరు నేతలు మాత్రమే తనను వ్యతిరేకిస్తున్నారని, అది కూడా ఎన్నికల సమయంలోనే ఎక్కువగా కనిపించిందని ఆమె వ్యాఖ్యానించారు.


అయితే నాగేంద్ర చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధినేత అన్నామలై స్పందిస్తూ.. శశికళను పార్టీలోకి ఆహ్వానించాలనేది నాగేంద్ర వ్యక్తిగతమైన అభిప్రాయమని, ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘‘ఎవరైనా బీజేపీలో చేరవచ్చు. అయితే పార్టీలో కొన్ని కీలక విషయాలపై పార్లమెంటరీ బోర్డ్, సీనియర్ లీడర్లు నిర్ణయాలు తీసుకుంటారు’’ అని అన్నామలై అన్నారు.

Updated Date - 2022-06-02T18:18:06+05:30 IST