రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయం

ABN , First Publish Date - 2022-07-02T05:12:52+05:30 IST

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మిజోరం మాజీ గవర్నర్‌ కుంభనం రాజశేఖరన్‌ పేర్కొన్నారు. దుబ్బాక, దౌల్తాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి ఈ నెల 3న ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో నిర్వహించే విజయ సంకల్ప సభకు

రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయం
సిద్దిపేటలో మాట్లాడుతున్న ఎంపీ అపరాజిత సారంగి

మిజోరం మాజీ గవర్నర్‌, బీజేపీ నేత కుంభనం రాజశేఖరన్‌


దుబ్బాక/దౌల్తాబాద్‌ జూలై 1: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మిజోరం మాజీ గవర్నర్‌ కుంభనం రాజశేఖరన్‌ పేర్కొన్నారు. దుబ్బాక, దౌల్తాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి ఈ నెల 3న ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో నిర్వహించే విజయ సంకల్ప సభకు జనసమీకరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారమే లక్ష్యంగా బూత్‌స్థాయి నుంచి కృషిచేయాలని సూచించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలని చెప్పారు. బీజేపీ పేదలు, దళిత గిరిజనులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. వాజ్‌పేయి హయాంలో అబ్దుల్‌కలాంను రాష్ట్రపతిని చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం నరేంద్రమోదీ గిరిజన మహిళను పోటీలో నిలిపారని పేర్కొన్నారు. దుబ్బాక పట్టణంలోని చేనేత సహకార సంఘాన్ని ఆయన సందర్శించి కార్మికులు తయారు చేసిన వస్త్రాలను పరిశీలించారు. పట్టణంలోని అయ్యప్ప, బాలాజీ ఆలయాలను ఆయన దర్శించుకున్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కుమ్మరి నర్సింహులు నాయకులు ఉన్నారు. 


 కాషాయ జెండా రెపరెపలాడటం తథ్యం

చేర్యాల : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయజెండా రెపరెపలాడటం తథ్యమని బీజేపీ పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం ధీమా వ్యక్తం చేశారు. చేర్యాల పట్టణంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ చెప్పే మాయమాటలకు ప్రజలు విసిగిపోయారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నరేంద్రమోదీ హజరయ్యే వియజ సంకల్ప సభకు కార్యకర్తలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేశ్‌, కోఆర్డినేటర్‌ బీరప్ప, నాయకులు శశిధర్‌రెడ్డి, రాందాస్‌, ఉమారాణి, స్వామి తదితరులు పాల్గొన్నారు.


సభను విజయవంతం చేయాలి  

సిద్దిపేట క్రైం : ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యే విజయసంకల్ప సభను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత సారంగి   పిలుపునిచ్చారు. సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా సిద్దిపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చి సత్తా చాటాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివా్‌సయాదవ్‌, నాయకులు రాంచంద్రారావు, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.


తెలంగాణలో బీజేపీదే అధికారం

జగదేవ్‌పూర్‌ : ఇక తెలంగాణలో బీజేపీదే అధికారమని బీజేపీ జార్ఖండ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు దీపక్‌ప్రకాష్‌ పేర్కొన్నారు. జగదేవ్‌పూర్‌ మండలంలోని తీగుల్‌లో శుక్రవారం ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లో పర్యటించారు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన సామ్యూల్‌, నరసన్నపేట గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి ఇంటికి వెళ్లారు. తిరుపతిరెడ్డి ఇంట్లో బీజేపీ నాయకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు రమే్‌షగుప్తా, శ్రీనివాస్‌, జిల్లా ఓబీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, నాయకులు శ్రీధర్‌, రాంరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రంలో రజాకార్ల పాలన 

హుస్నాబాద్‌ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రజాకార్ల పాలన సాగిస్తున్నాడని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం రాయ్‌గంజ్‌ ఎంపీ దేబాశ్రీచౌదరి పేర్కొన్నారు. శుక్రవారం హుస్నాబాద్‌ పట్టణంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల అవినీతి, కుటుంబ పాలనలో అరాచకమే తప్ప అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ గొప్ప విజన్‌ ఉన్న నాయకుడని పేర్కొన్నారు. విజయ సంకల్ప సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం హుస్నాబాద్‌ పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్‌ను ఆమె సందర్శించారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, సెన్సార్‌ బోర్డు సభ్యులు లక్కిరెడ్డి తిరుమల, జిల్లా ఉపాధ్యక్షులు విజయపాల్‌రెడ్డి, దొడ్డి శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:12:52+05:30 IST