జయాపజయాల్లో బీజేపీ ప్రస్థానం

ABN , First Publish Date - 2022-01-19T05:48:19+05:30 IST

‘జాతీయస్థాయిలో నరేంద్రమోదీకి జనాదరణ అపరిమితంగా ఉన్నా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వల్లే 2018 సంవత్సరాంతంలో ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో...

జయాపజయాల్లో బీజేపీ ప్రస్థానం

‘జాతీయస్థాయిలో నరేంద్రమోదీకి జనాదరణ అపరిమితంగా ఉన్నా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వల్లే 2018 సంవత్సరాంతంలో ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామ’ని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. ఆర్థికవేత్త ఇలా పట్నాయక్‌తో కలిసి రచించిన ‘ద రైజ్ ఆఫ్ ద బిజెపి: ద మేకింగ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ’ అన్న పుస్తకంలో ఆయన ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమిత్ షా అనుయాయుడిగా, తెర వెనుక ఎన్నికల వ్యూహకర్తగా పార్టీ శ్రేణుల్లో భూపేందర్ పేరొందారు. 2013లో రాజస్థాన్, 2014లో జార్ఖండ్, 2017లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని విజయపథంలో నడిపించిన నాయకుడిగా భూపేందర్ సుప్రసిద్ధుడు. బిజెపిపై ప్రజావ్యతిరేకత గురించి ఇతర విశ్లేషకులు ఎవరైనా వ్యాఖ్యానిస్తే అర్థం చేసుకోవచ్చుకాని భూపేందర్ యాదవ్ మాట్లాడడం ఆశ్చర్యకరంగానే ఉంటుంది.


నిజానికి 2014లో నరేంద్ర మోదీ ప్రభంజనం వీచి జాతీయస్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రస్థాయిలో నాయకత్వాలకు అంతగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ప్రతి అసెంబ్లీ ఎన్నికలోనూ నరేంద్రమోదీ తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్నట్లుగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆయన ప్రధానమంత్రి అయిన నాలుగేళ్లకు మూడు రాష్ట్రాల్లో బిజెపి అధికారం కోల్పోయింది. ఈ పరాజయానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజావ్యతిరేకతే అని భావించడంలో అర్థం లేదు. కేంద్ర ప్రభుత్వం పట్ల కూడా ప్రజా వ్యతిరేకత ఉండి ఉంటుందని భూపేందర్ యాదవ్ లాంటి వారు విశ్లేషించే సాహసం చేయలేరు. నిజానికి 2018లో మూడు రాష్ట్రాల్లో సాధించిన గెలుపును కాంగ్రెస్ సంఘటితం చేసుకుని సరైన వ్యూహాన్ని రూపొందించుకుని ఉంటే 2019లో ఆ పార్టీ అంత ఘోరంగా ఓటమిపాలయి ఉండేది కాదు. పరాజయాలను కూడా విజయాలుగా మార్చుకునే క్రమంలో బిజెపి అగ్రనాయక ద్వయం నరేంద్రమోదీ, అమిత్ షాల నుంచి నేర్చుకోవడంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు. ఓటర్లలో కొద్దిశాతం మంది అటూ ఇటూ మారినా సీట్లలో పెద్దఎత్తున తేడా ఉంటుందని జాగ్రత్తగా గమనించామని భూపేందర్ యాదవ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో బిజెపికి 41 శాతం, కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు వచ్చినా కాంగ్రెస్ అధిక సీట్లను గెలుచుకోగలిగింది. రాజస్థాన్‌లో బిజెపి 38.80 శాతం, కాంగ్రెస్ 38.85శాతం ఓట్లు సాధించినా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే బిజెపి ఓట్ల శాతం 8.4 శాతం పడిపోవడంతో తమ పార్టీ బలహీనపడిందని యాదవ్ విశ్లేషించారు. ఈ అంచనాల ఆధారంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ, ఆయన టీమ్ పకడ్బందీగా ఎన్నికల వ్యూహరచన చేసి 303 సీట్లకు పైగా సాధించింది.


ఈ గెలుపు ఎలా సాధ్యపడింది? ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా ప్రజలతో సంబంధాలు నెలకొల్పుకున్నారు. పేదలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఉజ్జ్వల, జనధన్ యోజన, ముద్రా యోజన, పిఎం ఆవాస్ వంటి పథకాలను సమర్థంగా అమలు చేయడమే ఆ విజయానికి ప్రధాన కారణాలని’ భూపేందర్ పేర్కొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మోదీకి ప్రత్యామ్నాయంగా బలమైన నాయకుడిని ప్రజల ముందు ఉంచడంలో ప్రతిపక్షాలు విఫలమవడం వల్లే 2019లో బిజెపి గెలుపు సాధ్యమయిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 2019 జనవరిలో కోల్‌కతాలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, బిఎస్‌పి, డిఎంకెతో సహా 23 పార్టీలు కలిసికట్టుగా బ్రిగేడియర్ మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసినప్పటికీ ప్రతి పార్టీ అధినేత తానే ప్రధానమంత్రి కావాలనుకోవడం వారి ప్రయోజనాలను దెబ్బతీసింది. మరోవైపు బలమైన సంస్థాగత నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం, నిరంతరం అగ్రనేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవడం మొదలైనవి బిజెపిని తిరుగులేని శక్తిలా మార్చివేశాయి. అమిత్ షా ప్రారంభించిన ‘సంవాద్ కేంద్ర’ (సమాచార కేంద్రం) నిరంతరం ప్రాథమిక సభ్యులనుంచి సమాచారాన్ని సేకరించడం, తనిఖీ చేయడం, డిజిటైజ్ చేయడం, పోలింగ్ బూత్‌లను మ్యాపింగ్ చేయడం, ప్రాథమిక సభ్యులు, కార్యకర్తలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను అనుసంధానం చేయడం మొదలు పెట్టింది. ఈ ‘సంవాద్ కేంద్ర’కు ఇన్‌చార్జి భూపేంద్ర యాదవే. ఆయన ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 193 సంవాద్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ఆధ్వర్యంలో 15వేల కాల్ సెంటర్లను నెలకొల్పారు. ప్రతి అయిదు బూత్‌లకు శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ సెంటర్ డేటా మేనేజిమెంట్ సిస్టమ్ పేరిట డేటాను, సమాచార సంబంధాలను నిర్వహించే వ్యవస్థను నెలకొల్పారు. సబ్సిడీలు స్వీకరించే 22 కోట్ల మంది లబ్ధిదారులు, 11 కోట్ల మంది ప్రాథమిక సభ్యులు, 2కోట్ల మంది పార్టీ కార్యకర్తలను నిరంతరం చేరుకున్నారు. 2019 ప్రచారంలో సంవాద్ కేంద్రాల ద్వారా 25 కోట్ల ఫోన్‌కాల్స్, 12 కోట్ల వాయిస్ మెసేజ్‌ల పంపిణీ, 11 కోట్ల టెక్స్ట్ సందేశాల పంపిణీ జరిగిందని భూపేంద్ర యాదవ్ తెలిపారు. పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులు జరపడం కూడా బిజెపి పట్ల ప్రజలు మొగ్గు చూపేలా చేసిందని, దేశంలో ఏకైక జాతీయవాద పార్టీగా బిజెపి తనను తాను చిత్రించుకోవడం వల్ల బలమైన, చెక్కుచెదరని నాయకత్వం దేశానికి లభించిందని ఓటర్లు విశ్వసించారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌తో బిజెపికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఆయన ఎక్కడా దాచుకోలేదు. ‘మాకు అంతర్గత సంబంధాలున్నాయి కాని మా సంస్థలు ఒకదానిపై మరొకటి ఆధారపడవు.’. అని ఆర్‌ఎస్ఎస్ నేత ఒకరు అన్నమాటల్ని ఆయన ఉటంకించారు.


ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు ప్రజల మనసులను ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మార్చడానికి బిజెపి ఉపయోగించిన పద్ధతుల గురించి చెప్పేందుకు భూపేందర్ యాదవ్ మొహమాటపడినట్లున్నారు. దేశంలోని 543 నియోజకవర్గాలకు గాను 160 నియోజకవర్గాల్లో డిజిటల్ మీడియా ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు తమ అంతర్గత సర్వేలో తేలిందని ఆయన అన్నారు. ఈ డిజిటల్ మీడియాను ఉపయోగించుకుని తమ దేశభక్తిని చాటుకోవడమే కాదు, ప్రతిపక్షాలను దేశవ్యతిరేకులుగా చిత్రించి అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేశారు. తాము అవలంబించే ఎన్నికల వ్యూహం విషయంలో ప్రతిపక్షాలు ఏ మాత్రం సాటిరావన్న విషయం ఆయనకు తెలియనిది కాదు. ప్రతిపక్ష పార్టీలను, నేతలను బలహీనపరిచేందుకు బిజెపి వివిధ కేంద్ర దర్యాప్తుసంస్థలను ఉపయోగించుకుంటున్న తీరు కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించడం అసందర్భమని ఆయన భావించినట్లున్నారు.


ఒక రాజకీయ పార్టీగా బిజెపి, జనసంఘ్ కాలం నుంచీ తమ ఓట్లను – 1951లో కేవలం 3.06 శాతం నుంచి 2019లో 37.76 శాతం దాకా – పెంచుకునే క్రమంలో జరిగిన అన్ని పరిణామాలను భూపేందర్ యాదవ్ పుస్తకం ఒక పద్ధతి ప్రకారం వివరించింది. అదే సమయంలో కాంగ్రెస్ లాంటి పార్టీ ప్రజలతో సంబంధాలు కోల్పోయి కేవలం అధికారం చెలాయించే పార్టీగా ఎలా మారిందో అర్థం చేసుకోవడానికి కూడా యాదవ్ పుస్తకం ఉపయోగపడుతుంది.


కాంగ్రెస్ పాఠాలు నేర్చుకునేందుకు భూపేందర్ యాదవ్ పుస్తకం అధికంగా ఉపయోగపడుతుంది. 2018లో మూడు ప్రధాన రాష్ట్రాల్లో విజయం సాధించిన తర్వాత కూడా పార్టీని ఒక బలమైన శక్తిగా మార్చుకోలేకపోవడమే కాదు, మోదీకి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని రూపొందించడంలోనూ కాంగ్రెస్ విఫలమైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. బిజెపి విస్తరణను చూసి ఒక్క పాఠం కూడా నేర్చుకున్నట్లు లేదు. స్వాతంత్ర్యం తెచ్చామని, గాంధీ వారసులమని కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నా, జనం బిజెపినే అధికంగా జాతీయవాద పార్టీగా ఎందుకు భావిస్తున్నారో కాంగ్రెస్ అర్థం చేసుకునే పరిస్థితి లేదు. గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం నుంచి గ్రామీణ ఉపాధి, ఆహారభద్రత చట్టం వరకు తామే ప్రవేశపెట్టామని కాంగ్రెస్ ఘనంగా చెప్పుకుంటుంది. అయితే కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను విశృంఖలంగా అమలు చేస్తున్న బిజెపిని జనం ఎందుకు ఆదరిస్తున్నారు? ఇందుకు కారణాలు ఏమిటో కాంగ్రెస్ చెప్పలేకపోతోంది. ఓబీసీలు, దళితులు తమ నుంచి వేరువడి బిజెపి, ఇతర పార్టీల వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారో చెప్పగలిగిన విశ్లేషకులు కాంగ్రెస్‌లో లేరు. ఇది నాయకత్వ లోపమా, లేక సంస్థాగతంగా పునరుత్థానం కాగలిగిన చేవ ఆ పార్టీలో పూర్తిగా క్షీణించిందా? ఈ ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ నేతలే చెప్పాలి.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భూపేందర్ యాదవ్ పుస్తకానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత మూలంగా బిజెపి ఓడిపోయే అవకాశం ఉన్నదని ఆయన అంగీకరించినందువల్ల ఉత్తరప్రదేశ్ గెలుపోటములను పూర్తిగా మోదీ ఖాతాలోకి చేర్చడం సరైంది కాదని ఆయన చెప్పకనే చెప్పారు. యూపీ మాత్రమే కాదు, 2024 వరకు వివిధ రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు బిజెపి చెమటోడ్చవలసి ఉంటుంది. మోదీ ప్రభావం ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నదని, ఇంతకంటే పెరిగే అవకాశం లేదని బిజెపి నేతలు సైతం భావిస్తున్నారు. మోదీ ఒక్కడి వల్లే విజయం సిద్ధించదు కనుకే ఇవాళ 12 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో లేదు. కొన్ని రాష్ట్రాల్లో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో క్రియాశీలకంగా ఉంటూ ఇతరులపై దాడులు చేసే వారిసంఖ్య కంటే బిజెపి ఓట్ల శాతం తక్కువేనన్న విషయం భూపేందర్ యాదవ్‌కు తెలియనిది కాదు. కేవలం సంస్థాగత బలాన్ని పటిష్ఠం చేయడం వల్లే విజయం సాధ్యం కాదు. ప్రజల మనోభావాలు వ్యతిరేకంగా మారితే ఎంత బలమైన సంస్థ కూడా ఏమీ చేయలేదు. ఈ సత్యానికి చరిత్రలో అనేక దృష్టాంతాలు ఉన్నాయని ఆయనకు తెలుసు.


ఎ. కృష్ణారావు 

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-01-19T05:48:19+05:30 IST