Bihar Politics : పాత ట్వీట్లతో బీజేపీ, ఆర్జేడీ యుద్ధం

ABN , First Publish Date - 2022-08-10T19:01:51+05:30 IST

బిహార్‌లో రాజకీయ పార్టీల మిత్ర, శత్రుత్వాల్లో మార్పులు రావడంతో

Bihar Politics : పాత ట్వీట్లతో బీజేపీ, ఆర్జేడీ యుద్ధం

న్యూఢిల్లీ : బిహార్‌లో రాజకీయ పార్టీల మిత్ర, శత్రుత్వాల్లో మార్పులు రావడంతో పాత ట్వీట్లతో నేతలు యుద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ (Giriraj Singh), ఆర్జేడీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad) గతంలో ఇచ్చిన ట్వీట్‌ను గిరిరాజ్ సింగ్ ప్రస్తావించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గతంలో ఇచ్చిన ట్వీట్‌ను ఆర్జేడీ ప్రస్తావించింది. 


బిహార్‌లో బీజేపీ, జేడీయూ కూటమి పక్షాలు విడిపోయిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, మరికొన్ని పార్టీలు కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగానూ, తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 


ఈ నేపథ్యంలో బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ బుధవారం లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో ఇచ్చిన ఓ ట్వీట్‌ను ప్రస్తావించారు. ఆ ట్వీట్‌లో నితీశ్ కుమార్ ఓ పాము వంటివారని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారని గుర్తు చేశారు. 2017లో మహాకూటమి నుంచి జేడీయూ వైదొలగినపుడు లాలూ ఈ ట్వీట్ చేశారని తెలిపారు. పాము కుబుసం విడిచినట్లు నితీశ్ కుమార్ ప్రతి రెండేళ్ళకు తన కూటమిని వదిలేస్తారని, ఈ విషయంలో ఏమైనా సందేహం ఉందా? అని లాలూ  ఆ ట్వీట్‌లో ప్రశ్నించారని గుర్తు చేశారు. 


పాము మీ ఇంట్లోకి చొరబడిందని లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఉద్దేశించి గిరిరాజ్ సింగ్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో హెచ్చరించారు. ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అనేకమంది కామెంట్ చేశారు. గిరిరాజ్ సింగ్ 2015లో ఇచ్చిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. అప్పట్లో బీజేపీని నితీశ్ కుమార్ విడిచిపెట్టడంతో నితీశ్, లాలూ అధికారం కోసం దురాశతో కలిశారని గిరిరాజ్ ఆరోపించారు. 


జేడీయూ, ఆర్జేడీ కలయికను బీజేపీ తీవ్రంగా దుయ్యబడుతోంది. ప్రజాతీర్పును జేడీయూ అవమానించిందని ఆరోపిస్తోంది. నితీశ్ కుమార్ తరచూ తన రాజకీయ మిత్ర పక్షాలను మార్చుతున్నారని మండిపడుతోంది. ఈ ఆరోపణలను తిప్పికొట్టడానికి  ఆర్జేడీ కూడా పాత ట్వీట్లను తవ్వి తీస్తోంది. 2017లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్‌ను బయటికి తీసింది. ‘‘దేశ, బిహార్ భవిష్యత్తు కోసం రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, వ్యవహరించడం ప్రస్తుతం అవసరం. భారత దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవడం బిహార్‌కు అలవాటు’’ అని మోదీ అప్పట్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ‘‘ఔనండీ, బిహార్ ఈ పనే చేస్తోంది. బీజేపీ మంత్రులు మురికిని నింపారు. బిహార్ ఓ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పుడు అవసరం’’ అని పేర్కొంది. 


2017 జూలైలో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మహా కూటమి నుంచి వైదొలగి, బీజేపీతో చేతులు కలిపింది. 2015 అక్టోబరు-నవంబరు నెలల్లో మహా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 


Updated Date - 2022-08-10T19:01:51+05:30 IST