Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 22 Jan 2022 02:04:51 IST

రాష్ట్రంలో పుంజుకున్న బీజేపీ

twitter-iconwatsapp-iconfb-icon
రాష్ట్రంలో పుంజుకున్న బీజేపీ

  • కానీ.. కేసీఆర్‌ను మాత్రం గద్దె దించలేదు
  • ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే
  • 6 ఎంపీ సీట్లు గెలుచుకోనున్న కమలం 
  • రెండు స్థానాలకు పడిపోనున్న కాంగ్రెస్‌
  • కేంద్రంలో నరేంద్ర మోదీదే హవా
  • రాహుల్‌కు మోదీతో పోలికే లేదన్న జనం
  • ప్రతిపక్ష నేతగా మమతా బెనర్జీకి ఓటు
  • ‘సీవోటర్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’లో వెల్లడి
  • ప్రపంచంలోనూ జనాదరణ మోదీకే!


న్యూఢిల్లీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అధికార టీఆర్‌ఎ్‌సతో ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ.. గతంలో కన్నా పుంజుకుందని ‘‘ఇండియా టుడే -సీవోటర్‌’’ నిర్వహించిన మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వేలో వెల్లడైంది. కానీ, సీఎం కేసీఆర్‌ను గద్దె దించే అవకాశం మాత్రం లేదని పేర్కొంది. సర్వే ఫలితాలను ఇండియా టుడే మేగజైన్‌ తాజాగా ప్రచురించింది. దీని ప్రకారం.. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో బీజేపీకి 6 సీట్లు వస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల కన్నా రెండు సీట్లను ఎక్కువ సాధిస్తుందని సర్వే పేర్కొంది. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు గత లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకోగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగితే ఒక సీటు కోల్పోయి 9 స్థానాలకు పరిమితమవుతాయని వివరించింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మరింత నష్టం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్లలో ఒక స్థానాన్ని కోల్పోతుందని వెల్లడించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడు ఎంపీ స్థానాలను దక్కించకోగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి దక్కేవి కేవలం 2 సీట్లేనని తెలిపింది. రాష్ట్రంలో పుంజుకున్న బీజేపీ

మోదీకే ప్రజాదరణ

దేశంలో ఇంకా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏదే హవా నడుస్తోందని మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ సర్వే తేల్చింది. 2021 ఆగస్టులో 54 శాతం ప్రజలు మోదీ పనితీరు అద్భుతంగా ఉన్నదని ప్రశంసించగా ఇప్పుడు వారి సంఖ్య 62.8 శాతానికి పెరిగింది. అయితే 2020 ఆగస్టులో మోదీ పనితీరును ప్రశంసించిన 78 శాతం కంటే ఇది తక్కువేని ఇండియా టుడే తెలిపింది.


కాగా ప్రజాదరణ విషయంలో మోదీకి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి  పోలికే లేదని, మరోసారి ప్రధానిగా మోదీయే ఉండాలని 52.5 శాతం జనం కోరుకోగా, రాహుల్‌ గాంధీని ప్రఽధానమంత్రిగా చూడాలని కేవలం 6.8 శాతం మందే కోరుకోవడం గమనార్హం. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు కూడా  మెరుగుపడిందని, 58.7 శాతం జనం మోదీ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారని సర్వే తెలిపింది. ధరల పెరుగుదల, నిరుద్యోగాన్ని మోదీ వైఫల్యాలుగా జనం గుర్తించినప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఆయన బాగానే నిర్వహించారని 51.9 శాతం ప్రజలు భావిస్తున్నట్లు ఇండియా టుడే పేర్కొంది. 


ప్రతిపక్షాల వెనకబాటుకు అదే కారణం..

మోదీ ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా జనం నమ్మదగ్గ అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు కల్పించకపోవడమే వారు వెనుకబడిపోవడానికి కారణంగా ఈ సంస్థ తెలిపింది, ఇప్పటి వరకు దేశానికి నాయకత్వం వహించిన ఇందిరాగాంధీ, అటల్‌ బిహారీ, వాజపేయి, జవహర్‌ లాల్‌ నెహ్రూ కంటే మంచి ప్రధానిగా జనం మోదీని భావిస్తున్నారని తేల్చింది. ఇక మోదీ వారసుడుగా ఎవరుంటారని సర్వే జరిపినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ల మధ్య గట్టి పోటీ ఉన్నదని తేలింది. దేశంలో ప్రతిపక్ష కూటమికి నేతగా ఉండడానికి మమతా బెనర్జీయే అర్హురాలని 17 శాతం మంది సర్వే తేల్చగా, ఆ తర్వాత స్థానం అరవింద్‌ కేజ్రీవాల్‌ (16 శాతం)కు దక్కింది.


ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత రాహుల్‌కు ఉన్నదని కేవలం 11 శాతం మందే భావించారు. అయితే మోదీ నాయకత్వంలోని బీజేపీని ప్రతిపక్ష కూటమి సవాలు చేయగలదని దేశంలో దాదాపు 50 శాతం మంది ప్రజలు భావిస్తున్నారని ఇండియా టుడే పేర్కొంది. ఈ నేపథ్యంలో రానున్న రెండేళ్లు మోదీకి ఎంతో కీలకమని, హిందూ ఓటర్లను సంఘటితం చేయడం, జాతీయవాదం జోరు పెంచడం,  జనాలకు తాయిలాలు పంచిపెట్టే సంక్షేమవాదం వల్ల నెగ్గుకురావడం కష్టమని కూడా సర్వే తెలిపింది. మోదీ ఆర్థిక విఽధానాలు బడా వ్యాపార సంస్థలకు అధికంగా దోహదం చేస్తున్నాయని, స్వేచ్చగా మాట్లాడే వాతావరణం లేకపోవడం, ప్రజాస్వామిక సంస్థల ప్రమాణాలు పడిపోవడం, మైనారిటీల్లో పెరుగుతున్న ఆందోళన వంటివి కూడా మోదీకి వ్యతిరేకంగా మారాయని ఇండియా టుడే తెలిపింది. 


సీఎంలలో యోగికే అత్యధిక జనాదరణ

దేశంలోని అత్యంత జనాదరణ గల ముఖ్యమంత్రుల్లో ప్రథమ స్థానం ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు దక్కిందని ఇండియా టుడే తెలిపింది. 27.1 శాతం మంది యోగికి మద్దతు పలకగా, ఆ తర్వాతి స్థానాలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ (19.9శాతం), మమతా బెనర్జీకి(10.8శాతం) దక్కాయి. తమిళనాడు సీఎం స్టాలిన్‌ (6.7శాతం), ఉద్ధవ్‌ ఠాక్రే (4.9)శాతం నాలుగో, ఐదో స్థానాల్లో ఉన్నారు.రాష్ట్రంలో పుంజుకున్న బీజేపీ

దేశాధినేతల్లో ముందంజలో మోదీ

ప్రపంచంలోని దేశాధినేతల్లో నరేంద్ర మోదీకే పాపులారిటీ ఎక్కువగా ఉందని ‘ద మార్నింగ్‌ కన్సల్ట్‌ పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌’ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థ జరిపిన సర్వేలో మోదీకి 71 శాతం రేటింగ్‌ లభించినట్లు తెలిపింది. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ 66 శాతంతో రెండో స్థానంలో, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ 60 శాతంతో మూడో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆరో స్థానం (43 శాతం) మాత్రమే దక్కిందని తెలిపింది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.