Abn logo
Apr 22 2021 @ 11:59AM

బెంగాల్ ఎన్నికల ఆరో దశలో ఆ ఇద్దరిపైనే బీజేపీ ఆశలు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ గురువారం జరుగుతోంది. నాలుగు జిల్లాల్లోని 43 నియోజకవర్గాలకు 306 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఇద్దరు మాజీ టీఎంసీ నేతలపైనా, మతువా సామాజిక వర్గంపైనా ఆశలు పెట్టుకుంది. ముకుల్ రాయ్‌‌, అర్జున్ సింగ్ పలుకుబడితో రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లా అయిన ఉత్తర 24 పరగణాల జిల్లాలో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని ఆశిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై హామీ ఇచ్చి మతువా సామాజిక వర్గానికి చేరువయ్యేందుకు ప్రయత్నించింది. 


ముకుల్ రాయ్, అర్జున్ సింగ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. వీరిద్దరూ గతంలో టీఎంసీలో పలుకుబడిగల నేతలు. అర్జున్ సింగ్ గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన టీఎంసీ ఎంపీ దినేశ్ త్రివేదిని ఓడించారు. అయితే దినేశ్ ఇటీవలే బీజేపీలో చేరారు. అర్జున్ సింగ్ 2001 నుంచి నాలుగుసార్లు భట్పర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గం బారక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. మరోవైపు భట్పర నుంచి ఆయన కుమారుడు పవన్ , నోవాపర నుంచి ఆయన తోడల్లుడు సునీల్ కూడా బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. 


ముకుల్ రాయ్ నాడియా జిల్లాలోని కృష్ణానగర్ నార్త్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు సుభ్రాంశు నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బీజ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 


ముకుల్ రాయ్, అర్జున్ సింగ్ టీఎంసీలో ఉన్నపుడు ఆ పార్టీ ఉత్తర 24 పరగణాల జిల్లాలో బలోపేతమవడానికి చాలా కృషి చేశారు. అనంతరం వీరు బీజేపీలో చేరడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ మొట్టమొదటిసారి ఈ జిల్లాలో గట్టి లబ్ధి పొందింది. 


బీజేపీ ఆశలు పెట్టుకున్న మరొక వర్గం మతువా హిందూ దళితులు. వీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు. అందుకే వీరికి సీఏఏను అమలు చేస్తామనే హామీని బీజేపీ ఇచ్చింది. దీంతో వీరిలో అత్యధికులు తమవైపు మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ విశ్వసిస్తోంది. 


సీఏఏను అమలు చేయడం వల్ల పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన హింసకు గురై, మన దేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులకు మన దేశ పౌరసత్వం ఇవ్వవచ్చు. 


Advertisement
Advertisement