TS News: రాజగోపాల్‌రెడ్డిని రేపు ఢిల్లీ తీసుకెళ్లాలనుకున్న బండి సంజయ్.. ఇంతలోనే..

ABN , First Publish Date - 2022-07-28T23:06:44+05:30 IST

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) హాట్ టాఫిక్ అవుతున్నారు.

TS News: రాజగోపాల్‌రెడ్డిని రేపు ఢిల్లీ తీసుకెళ్లాలనుకున్న బండి సంజయ్.. ఇంతలోనే..

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) హాట్ టాఫిక్ అవుతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే కాంగ్రెస్ ఆయనను వదులు కోవడానికి సిద్ధంగా లేదు. రాజగోపాల్‌రెడ్డిని బీజేపీ (BJP)లో చేర్చుకునేందుకు కమలనాథులు ఆరాటపడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి చేరికపై బీజేపీలో చర్చ జరుగుతోంది. ఆయనను రేపు (శుక్రవారం) ఢిల్లీ తీసుకెళ్లాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అయితే బీజేపీ నేతలకు ఆయన మెలిక పెట్టారు. పార్టీలో చేరేందుకు మరో వారం సమయం ఇవ్వాలని కమల నేతలను కోరినట్లు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే (MLA) పదవికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకోవాలని కమలం పార్టీ యోచిస్తోంది. అయితే రాజగోపాల్ రాజీనామా (Resignation)పై ఎటూ తేల్చకుండా బీజేపీ నేతలను గందరగోళ పెడుతున్నట్లు సమాచారం. రాజీనామాపై ఆగస్ట్ 7 వరకు సమయం ఇవ్వాలని కోరినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. రాజగోపాల్‌రెడ్డి రెండేళ్లుగా నిలకడలేని కామెంట్స్ చేస్తున్నారని బీజేపీ క్యాడర్ అంటోంది.


రాజగోపాల్‌రెడ్డి కాషాయ కండువా వేసుకోబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) స్వయంగా ధ్రువీకరించారు. రాజగోపాల్‌రెడ్డితోపాటు మరికొందరు కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీలో కాషాయ కండువా వేసుకుంటారని వెల్లడించారు. అయితే బీజేపీ నేతల ఆశలకు రాజగోపాల్‌రెడ్డి నిర్ణయం బ్రేక్ వేసినట్లయింది. అయితే కొన్ని రోజులుగా చేరికల విషయంలో దూకుడు పెంచిన బీజేపీ.. చాప కింద నీరులా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఇంకెంత మంది నాయకులు కాషాయ కండువా వేసుకోబోతున్నారు? కాంగ్రెస్‌ నుంచి ఎంత మంది? టీఆర్‌ఎస్‌ (TRS) నుంచి ఎంతమంది? ఏయే జిల్లాల నుంచి ఉండబోతున్నాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం పార్టీకి ఉన్న బలం సరిపోదని బీజేపీ భావిస్తోంది. అందుకే, ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న నాయకులను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను రాష్ట్ర నేతలకు అప్పగించారు. ఇందులో భాగంగానే అప్పటివరకు కొనసాగిన చేరికల కమిటీ స్థానంలో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ (Congress), టీఆర్‌ఎస్‌ నేతలతో సంప్రదింపులు జరిపామని బీజేపీ చెబుతున్నారు. 

Updated Date - 2022-07-28T23:06:44+05:30 IST