అమరావతి : కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థుల ఎంపికలోనే ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ అభ్యర్థిగా డాక్టరు ఓబులాపురం రాజశేఖర్.. వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టరు దాసరి సుధాను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ-జనసేన కలిసి అభ్యర్థిని బరిలోకి దింపుతాయా..? లేదా..? అనే విషయంపై శనివారం నాడు బహిరంగ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసేశారు. ఎమ్మెల్యే మరణంతో ఆయన సతీమణికే వైసీపీ టికెట్ ఇవ్వటంతో తాము పోటీ చేయబోమని జనసేన ప్రకటించింది.
ఇప్పుడు పవన్ ఏమంటారో..!?
అయితే.. బీజేపీ మాత్రం పోటీ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే రాష్ట్ర, కడప జిల్లా కమలనాథులతో అధిష్టానం ఈ విషయంపై చర్చించిందని తెలుస్తోంది. సుదీర్ఘ చర్చల అనంతరం పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించిందని సమాచారం. బీజేపీ ప్రకటనతో జనసేన సందిగ్ధంలో పడింది.!. మరోవైపు ఈ విషయంపై ఇప్పటికే జనసేన నేతలతో కూడా అధిష్టానం చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ కడప జిల్లాలో బీజేపీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం పోటీపై బీజేపీ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే జనసేన-బీజేపీ మధ్య పలు విషయాల్లో విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పోటీ చేయట్లేదని జనసేన చెప్పగా.. సమస్యే లేదని కచ్చితంగా పోటీ చేసి తీరుతామన్నట్లుగా బీజేపీ చెప్పడం గమనార్హం. దీనిపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.