గెహ్లోత్ సర్కార్‌పై ’’అవిశ్వాస’’ అస్త్రం ప్రయోగించనున్న కమలం

ABN , First Publish Date - 2020-08-13T21:19:27+05:30 IST

బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది.

గెహ్లోత్ సర్కార్‌పై ’’అవిశ్వాస’’ అస్త్రం ప్రయోగించనున్న కమలం

జైపూర్ : బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. బల పరీక్ష నిర్వహించి తీరుతామన్న దృఢ సంకల్పంతో సీఎం గెహ్లోత్ ఉన్నారు. ఇప్పటి వరకూ ఈ పదాన్ని గెహ్లోతే ఉచ్చరిస్తూ వస్తున్నారు. కానీ... ఒక్క సమావేశంతో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ పూర్తిగా వ్యూహాన్ని మార్చేసింది. తామే సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా గురువారం ప్రకటించారు.


‘‘ప్రభుత్వ పక్షంలో చెప్పలేనన్ని విభేదాలున్నాయి. వారు పోట్లాడుతున్న పరిస్థితి చూస్తుంటే... వారు బల పరీక్ష వైపే మొగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ... మేమే సర్కారుపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్నాం’’ అని సతీశ్ పూనియా సంచలన ప్రకటన చేశారు.


సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన సమయంలో అసెంబ్లీని సమావేశపరచాలంటూ సీఎం గెహ్లోత్ గవర్నర్‌ మిశ్రాను కోరిన విషయం తెలసిందే. దీంతో ఆయన ఆగస్టు 14న సమావేశం నిర్వహించడానికి పచ్చా జెండా ఊపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ సీఎం వసుంధరతో పాటు ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కూడా హాజరయ్యారు.


ఈ సమావేశంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై బీజేపీ నేత గులాంచంద్ కటారియా మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్ బట్టను తిరిగి కుట్టడానికి ప్రయత్నిస్తోంది. కానీ అది చిరిగిన బట్ట. దానిని అతికించడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. ఇది తొందరగా కూలిపోయే సర్కార్.’’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ బలం. 107. బీజేపీ బలం 76. 

Updated Date - 2020-08-13T21:19:27+05:30 IST