జగన్మోహన్‌రెడ్డి పాలనలో దోపిడీదారులుగా ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-06-29T06:29:17+05:30 IST

జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి అమ్మే దోపిడీదారులుగా మారారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

జగన్మోహన్‌రెడ్డి పాలనలో దోపిడీదారులుగా ఎమ్మెల్యేలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
కె.గంగవరం, జూన్‌ 28: జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి అమ్మే దోపిడీదారులుగా మారారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కోనసీమ జిల్లా కోటిపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇల్లు నిర్మించుకోవాలన్నా, స్థలం మెరక చేసుకోవడానికి ఎర్ర గ్రావెల్‌ కావాలన్నా ఎమ్మెల్యే నుంచే కొనాల్సిన పరిస్థితులు కల్పించారన్నారు. అవినీతి పాలన చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ప్రస్తుతం ప్రతీ వ్యక్తిపై రూ.4 లక్షల అప్పు ఉందని, తొందరలోనే ఇది రూ.10 లక్షలకు చేరుకుంటుందని విమర్శించారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన వారే మద్యం తయారుచేసి విక్రయిస్తున్నారన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు మిల్లర్లతో కలిసి పేదల బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తున్నాయన్నారు. లేకపోతే విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. ఆ సంస్థకు కాకినాడ ఎమ్మెల్యే తండ్రి చైర్మన్‌ అని ఎద్దేవా చేశారు. కిలో బియ్యానికి ప్రధాని నరేంద్ర మోదీ రూ.38.40 ఇస్తుంటే జగన్‌ రూ.2 చెల్లించి వ్యానులపై పెద్ద ఫొటోలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. ప్రతీనెలా ఇస్తున్న రెండో కోటాను మూడు నెలలుగా ఇవ్వట్లేదన్నారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో సాధించిన ప్రగతిని వివరించారు. తీర ప్రాంతాల్లో ఒక్కో జెట్టీకి రూ.450 కోట్లతో 15 జెట్టీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం వాటా ఇవ్వడానికి ముందుకు రావడం లేదని చెప్పారు. అభివృద్ధి అంటే ఎవరి కాళ్లపై వాళ్లు నిలబడేటట్టు చేసి సాధికారిత సాధించడం కానీ డబ్బులు పంచడం కాదని వైసీపీ ప్రభుత్వానికి చురకలు వేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కేంద్ర నిధులతోనే అమలవుతున్నాయని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని అధికారపక్షానికి సవాల్‌ విసిరారు. కోనసీమ జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు స్వచ్ఛభారత్‌, జలజీవన్‌ మిషన్‌, ఇంటింటికీ గ్యాస్‌ పథకాల గురించి వివరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమా, జిల్లా నాయకులు మాలకొండయ్య, బిట్ర శివన్నారాయణ మాట్లాడారు. చిట్టిబాబును మత్స్యకార సంఘాలు సన్మానించాయి.

Updated Date - 2022-06-29T06:29:17+05:30 IST