రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాక శివాలయం శుభ్రం చేసిన ముర్ము

ABN , First Publish Date - 2022-06-22T19:47:50+05:30 IST

రాజకీయరంగ ప్రవేశం తర్వాత బీజేపీ తరఫున 1997లో రాయ్‌రంగ్‌పూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజూ జనతాదళ్‌ (బీజేడీ), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000..

రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాక శివాలయం శుభ్రం చేసిన ముర్ము

భుబనేశ్వర్: రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం తాను చిన్నప్పటి నుంచి వెళుతున్న శివాలయానికి వెళ్లిన ద్రౌపది ముర్ము.. గుడి అంతా చీపురుతో శుభ్రం చేశారు. అనంతరం గుడిలోని శివుడిని ఆమె దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ ద్రౌపది ముర్ముని ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి అని భారతీయ జనతా పార్టీ మంగళవారం ప్రకటించింది. వెనుకబడిన ఒడిస్సా రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్‌ 20న గిరిజన కుటుంబంలో ఆమె జన్మించారు. వీరిది గిరిజన వర్గంలోని సంథాల్‌ తెగ. పేదరికపు అడ్డంకులను అధిగమిస్తూ విద్యాభ్యాసం సాగించారు. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ చదివారు. ఆర్ట్స్‌ విద్యార్థి అయిన ముర్ము.. సాగునీటి-విద్యుత్తు శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యా కేంద్రంలో స్వచ్ఛందంగా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.


రాజకీయరంగ ప్రవేశం తర్వాత బీజేపీ తరఫున 1997లో రాయ్‌రంగ్‌పూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజూ జనతాదళ్‌ (బీజేడీ), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్య వాణిజ్య, రవాణా, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2015 మే 18న జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021 జూన్‌ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ముర్ము చరిత్రకెక్కారు. కాగా, తాజాగా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన ముర్ము.. ఈ ఎన్నికల్లో గెలిస్తే తొలి గిరిజన, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగానే కాక.. స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతి ఈమెనే కానున్నారు. కాగా, బీజేపీకి ఉన్న బలం కారణంగా ఈమె గెలుపు లాంఛనమే అని అంటున్నారు.

Updated Date - 2022-06-22T19:47:50+05:30 IST