రాజధానిపై.. రాక్షస క్రీడ

ABN , First Publish Date - 2022-08-05T05:48:24+05:30 IST

అమరావతిపైనే కాదు.. రాష్ట్రమన్నా, ప్రజలన్నా ముఖ్యమంత్రి జగన్‌కు ధ్వేషమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు.

రాజధానిపై.. రాక్షస క్రీడ
సభలో మాట్లాడుతున్న పాటిబండ్ల రామకృష్ణ

రాష్ట్రమన్నా, ప్రజలన్నా సీఎం జగన్‌కు ధ్వేషం

పాదయాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

సీఎం మారినప్పుడల్లా రాజధానిని మార్చలేరన్న కన్నా లక్ష్మీనారాయణ

2024లో తప్పు చేస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడన్న సుజనాచౌదరి

విశాఖలోని భూముల ధరల పెంచుకునేందుకే మూడు ముక్కలాటన్న ఆదినారాయణరెడ్డి  

గుంటూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): అమరావతిపైనే కాదు.. రాష్ట్రమన్నా,  ప్రజలన్నా ముఖ్యమంత్రి జగన్‌కు ధ్వేషమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్ధతుగా బీజేపీ చేపట్టిన మనం- మన అమరావతి ఏడు రోజుల పాదయాత్ర ముగింపు సభ గురువారం తుళ్లూరులో జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓట్లు వేయనివారి మీద జగన్‌ కసితో మొత్తం ప్రజలనే హింసిస్తున్నారన్నారు. అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములివ్వాలని కోరితే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఒక్కరు కూడా ముందుకు రాలేదన్నారు. ఇందుకు కారణం రాజధాని రైతుల విషయంలో జగన్‌ నేర్పిన పాఠమేనని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మార్చలేరన్నారు. రాజధాని నుంచి పూచిక పుల్ల కూడా కదల్చలేరని ఆనాడే చెప్పామని, ఇప్పుడు అదే జరిగిందని గుర్తు చేశారు. జగన్‌ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని తెలిపారు. జగన్‌ సీఎం కావడం వల్ల రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీనే బాగుపడిందని ఎద్దేవా చేశారు. కేంద్రం అమరావతికి కట్టుబడి ఉన్నందునే విజయవాడకు ఫ్లైఓవర్లు, ఎయిమ్స్‌, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఇక్కడికి వచ్చాయన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సుజనాచౌదరి మాట్లాడుతూ 2019 ప్రజలు తెలిసో తెలియక తప్పు చేశారని, 2024లో తప్పు చేస్తే రాష్ట్రాన్ని, ప్రజలను ఆ దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు. అమరావతి రాష్ట్రానికి విలువైన సంపదని, హైదరాబాద్‌లాగా అభివృద్ధి చెందితే వచ్చే ఆదాయం అన్ని ప్రాంతాలకు పంపిణీ అవుతుందని వివరించారు.  మాజీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ చేసే పని ఏదైనా కళ్లకు కనపడేలా ధైర్యంగా చేయాలన్నారు. కోర్టులో ఒక సమాధానం బయట ఒక సమాధానం చెప్పడం సరికాదన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ఇది ఎక్కడికీ పోదని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ   వైఎస్‌ హయాంలో విశాఖలో వేల ఎకరాల భూములు సొంతం చేసుకుని వాటి ధరలు పెంచుకునేందుకే మూడు రాజధానుల నాటకమన్నారు. అతి స్వల్పకాలంలో 5 లక్షల కోట్లు వెనకేసిన ఘనుడు జగన్‌రెడ్డి అని ఆరోపించారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, పాదయాత్ర కోఆర్డినేటర్‌ జయప్రకాశ్‌ నారాయణ, లంకా దినకర్‌  తదితరులు ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో రాజధాని రైతులు సభలో పాల్గొన్నారు. డా. కే. భగవాన్‌ దాస్‌ రచించిన ‘చరిత్ర సత్యాలు- జాతి రత్నాలు’ అనే పుస్తకాన్ని సత్యకుమార్‌ ఆవిష్కరించారు. సభలో సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతున్న సమయంలో రైతుల్లో విశేష స్పందన కనిపించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోమ్‌మంత్రి అమిత్‌షాతో స్వయంగా మాట్లాడిస్తామని సత్యకుమార్‌ హామీ ఇచ్చిన సందర్భంలో కూడా రైతుల నుంచి అదే స్థాయిలో స్పందన వచ్చింది. 

Updated Date - 2022-08-05T05:48:24+05:30 IST