తెలంగాణ విభజనను వ్యతిరేకించిన బీజేపీ

ABN , First Publish Date - 2022-08-11T06:19:52+05:30 IST

పార్లమెంట్‌లో తలుపులు మూసి తెలంగాణ విభజనను వ్యతిరేకించిన పార్టీ బీజేపీ అని, స్వాతంత్య్ర పోరాటయోధులు దేశం కోసం చేసిన ప్రాణ త్యాగాలను విస్మరించి వజ్రోత్సవాల్లో పీఎం నరేంద్రమోదీ భజన చేస్తున్నారని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు.

తెలంగాణ విభజనను వ్యతిరేకించిన బీజేపీ
ఎల్లారెడ్డిపేటలో పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ పాదయాత్ర

- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌  

సిరిసిల్ల రూరల్‌/ ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 10:  పార్లమెంట్‌లో తలుపులు మూసి తెలంగాణ విభజనను వ్యతిరేకించిన పార్టీ బీజేపీ అని, స్వాతంత్య్ర పోరాటయోధులు దేశం కోసం చేసిన ప్రాణ త్యాగాలను విస్మరించి వజ్రోత్సవాల్లో పీఎం నరేంద్రమోదీ భజన చేస్తున్నారని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన పాదయాత్ర ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం రెండో రోజు సాగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశ ప్రగతికి పాటుపడిన మహానీయులను కేంద్ర ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. జీఎస్టీ పేరిట అధిక భారం మోపి సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా దిగజార్చిందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను,  కాంగ్రెస్‌ పార్టీ చేసిన సేవలను ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేపట్టామన్నారు. కరీంనగర్‌ ఎంపీగా పని చేసిన కాలంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌ ఏం చేశారో ప్రజలకు వివరించాలని సవాల్‌ విసిరారు. ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల చౌరస్తాలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పార్లమెంట్‌ సభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలుపొందిన బండి సంజయ్‌ సమస్యలను పక్కన పెట్టి భాగ్యలక్ష్మి ఆలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి కేటీఆర్‌ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటే గ్రామాల పర్యటనకు వచ్చిన ప్రతీసారి ముందస్తు అరెస్ట్‌లు ఎందుకు చేయిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.  అభివృద్ధి పనుల్లో అవినీతికి చిరునామాగా మారారని ధ్వజమెత్తారు. అనంతరం  కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక  మాట్లాడుతూ  మూడు రంగుల జెండాలను పట్టుకొని యాత్రలు చేస్తున్న బీజేపీ నాయకులకు  తిరంగా జెండా గురించి ఏం తెలుసని, స్వాతంత్య్ర పోరాటం నుంచి తెలంగాణ సాధన వరకు కాంగ్రెస్‌ది కీలక పాత్రని ఆఅన్నారు. నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్‌, సత్యం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ  పాదయాత్ర రాగట్లపల్లికి చేరుకుంటుండగా  బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ వాహనం అటువైపు వచ్చింది.  దీంతో వాహనం దిగి ప్రభాకర్‌గౌడ్‌తో కరచాలనం చేశారు.  

విలీన గ్రామాల ప్రజలను పట్టించుకోని కేటీఆర్‌ 

 సిరిసిల్ల మున్సిపల్‌లో  విలీనం చేసిన ప్రజలను ‘ఉపాధి’కి దూరం చేశారని, సమస్యలతో విల విల్లాడుతున్న మంత్రి కేటీఆర్‌, మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిరిసిల్ల నియో జకవర్గంలోని  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేపట్టిన  పాదయాత్ర రెండోరోజు బుధవారం సాయంత్రం సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని సర్ధాపూర్‌కు చేరుకుంది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఆయన సతీమణి మంజులకు పార్టీ నాయకులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.   అనంతరం మార్గమధ్యలో ఉన్న సర్ధాపూర్‌ఎల్లమ్మ ఆల యానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.   పెద్దూర్‌ గ్రామ శివారులోని కల్లు మండువా వద్ద గీత కార్మికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నం మాట్లాడారు.    సిరిసిల్ల అర్బన్‌ మండలంగా ప్రకటించిన తరువాత పట్టణానికి ఆనుకొని ఉన్న ఏడు గ్రామాలతోపాటు అనుబంధ గ్రామాలను సైతం సిరిసిల్ల మున్సిపల్‌లో మంత్రి కేటీఆర్‌  విలీనం చేశారన్నారు.  విలీన సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, జిల్లా అర్గనైజింగ్‌ కార్యదర్శి గంభీరావుపేట ప్రశాంత్‌గౌడ్‌, మంగ కిరణ్‌కుమార్‌, మంగ మల్లేశం, అకునూరి బాలరాజు, బాలకిష్టయ్య, గౌడ సంఘం నాయకులు ముష్కం పెద్దదేవయ్య, లడ్డూభాయ్‌, నారాయణగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:19:52+05:30 IST