కవిత గెలుపు..ఓ గెలుపేనా ?

ABN , First Publish Date - 2020-10-16T06:13:56+05:30 IST

‘నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు లోకసభ ఎన్నికలలో కవితను తిరస్కరించారు. తిరిగి ఆమెను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబెట్టి గెలిపించుకున్నారు

కవిత గెలుపు..ఓ గెలుపేనా ?

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ


గద్వాల, అక్టోబరు 15 : ‘నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు లోకసభ ఎన్నికలలో కవితను తిరస్కరించారు. తిరిగి ఆమెను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబెట్టి గెలిపించుకున్నారు. కవిత గెలుపు ఓ గెలుపేనా?’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. గద్వాల పట్టణంలోని ఎస్‌వీ ఈవెంట్‌ హాలులో జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి గడ్డం కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీకే అరుణ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు ఘోర అవమానం జరుగబోతుందని జోస్యం చెప్పారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వినియోగించిన ఓటరు జాబితాను పూర్తిగా రద్దు చేసి, 2017 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారికి ఓటు హక్కును కల్పించడం లాంటి వింత ధోరణులు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు.


ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కును నమోదు చేయడానికి టీఆర్‌ఎస్‌ నాయకులు హైదరాబాద్‌లోని కళాశాలలో దొంగ ఓట్లను నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిని రాష్ట్ర ఎన్నికల సంఘం గమనించాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదన్నారు. రెండు స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందనిఽ ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు రమాదేవి, కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎక్బోటే రవి, అశోక్‌, సంజీవ్‌ భరద్వాజ్‌, ఓబీసీ సంఘం అధ్యక్షుడు, నర్సింహులు, ఎస్పీ మోర్చా అధ్యక్షుడు చందు తదితరులు ఉన్నారు. 


టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిక

ధరూరు మండలం పాత పాలెం గ్రామానికి చెందిన పలువురు యువకులు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో మహేశ్‌గౌడ్‌, వీరన్న, ఆంజనేయులు, స్వామి, అంజీ, గోపి, సుభాస్‌, అజాద్‌, వీరేశ్‌యాదవ్‌, బి.ఆంజనేయులు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-10-16T06:13:56+05:30 IST