బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ

ABN , First Publish Date - 2020-09-27T08:21:42+05:30 IST

భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దగ్గుబాటి పురందేశ్వరికి దక్కింది. ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు తెలుగువారు రాంమాధవ్‌, మురళీధర్‌రావులను తప్పించి...

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ

  • ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్‌ 
  • ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి 
  • రాంమాధవ్‌, మురళీధర్‌, జీవీఎల్‌ ఔట్‌
  • కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన నడ్డా


న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దగ్గుబాటి పురందేశ్వరికి దక్కింది. ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు తెలుగువారు రాంమాధవ్‌, మురళీధర్‌రావులను తప్పించి.. పురందేశ్వరికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి డీకే అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో నియమించారు. కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌ను అదే పదవిలో కొనసాగించాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ రాష్ట్ర శాఖ మాజీ అఽధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో జాతీయ స్థాయిలో మళ్లీ నలుగురు తెలుగు వారికి, అందులో ఇద్దరు మహిళలకు పార్టీలో కీలక స్థానం దక్కినట్లయింది. కాగా, నిన్నటి వరకూ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్‌ నరసింహారావును ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ నూతన కార్యవర్గాన్ని పార్టీ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా శనివారం ప్రకటించారు.



ఆ ముగ్గురి తొలగింపు అందుకే?

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో రాంమాధవ్‌, మురళీధర్‌రావును తొలగిస్తారన్న అంశంపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. రాంమాధవ్‌ను గత కొంతకాలంగా వివిధ బాధ్యతల నుంచి తప్పిస్తూ వస్తున్నారు. ఇక మురళీధర్‌రావుపై అంతగా ఆరోపణలు లేకపోయినా.. ఆయన దాపరికం లేకుండా మాట్లాడతారనే విమర్శలు ఉన్నాయి. కాగా, జీవీఎల్‌ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో తలదూర్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రధాని నరేంద్రమోదీ త్వరలో తన కేబినెట్‌ను విస్తరించనున్నట్లు, అందులో మంత్రులుగా అవకాశం కల్పించేందుకే కొందరు నేతలను జాతీయ కార్యవర్గం నుంచి తప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-09-27T08:21:42+05:30 IST