రాజధాని అంశంపై జీవీఎల్ తాజా వ్యాఖ్యలివీ

ABN , First Publish Date - 2020-08-06T22:26:12+05:30 IST

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద రగడే నెలకొన్న విషయం విదితమే.

రాజధాని అంశంపై జీవీఎల్ తాజా వ్యాఖ్యలివీ

అమరావతి/ఢిల్లీ : మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద రగడే నెలకొన్న విషయం విదితమే. ఈ విషయమై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇప్పటికే రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇవాళ కూడా.. ఏపీ రాజధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని దాఖలైన అఫిడవిట్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. ఏపీ రాజధాని అంశంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదంటూ ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. రాష్ట్ర రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇంకా కొందరు బీజేపీ నేతలు మాత్రం రాజధాని విషయమై ఏదేదో మాట్లాడేస్తున్నారు. 


తాజా వ్యాఖ్యలివీ..

ఈ తరుణంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మీడియా ముందుకొచ్చారు. గురువారం నాడు న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిది కాదని మరోసారి స్పష్టం చేశారు. అంతటితో ఆగని ఆయన.. కొందరు నేతలు వారి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ లైన్‌కు విరుద్ధంగా చెబుతున్నారని జీవీఎల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కావాలనే కొందరు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ చెప్పుకొచ్చారు. పార్టీ లైన్‌కు విరుద్ధంగా వెళ్తున్న నేతల పేర్లను మాత్రం ఎంపీ బయటపెట్టలేదు.

Updated Date - 2020-08-06T22:26:12+05:30 IST