అసదుద్దీన్ ఒవైసీ శ్రీరాముని వంశస్థుడు : బీజేపీ ఎంపీ

ABN , First Publish Date - 2022-02-16T00:07:38+05:30 IST

ఆలిండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం

అసదుద్దీన్ ఒవైసీ శ్రీరాముని వంశస్థుడు : బీజేపీ ఎంపీ

లక్నో : ఆలిండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శ్రీరాముని వంశస్థుడని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. ఆయన కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్ బీజేపీ అభ్యర్థిగా గోండా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 


బ్రిజ్ భూషణ్ కైసెర్‌గంజ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. తన కుమారుడు ప్రతీక్ విజయం కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒవైసీ తనకు పాత మిత్రుడని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఆయన క్షత్రియుడని తెలిపారు. ఆయన శ్రీరాముని వంశస్థుడని, ఇరాన్‌కు చెందినవాడు కాదని చెప్పారు. ఒవైసీ పార్టీతో సమాజ్‌వాదీ పార్టీ పొత్తు కుదుర్చుకోనందుకు మండిపడ్డారు. ముస్లింలపై నాయకత్వం కోసం అఖిలేశ్ యాదవ్, ఒవైసీ పోట్లాడుకుంటున్నారన్నారు. 


ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మోసగాడన్నారు. ఆయన తన తండ్రిని, తన అంకుల్‌ను మోసం చేశాడన్నారు. మోసం చేయడమే ఆయన పని అని దుయ్యబట్టారు. బీజేపీకి రాజీనామా చేసి ఎస్‌పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్యను కూడా మోసం చేశారని ఆరోపించారు. 


Updated Date - 2022-02-16T00:07:38+05:30 IST