బీజేపీ ఎమ్మెల్యేలు నన్ను కలిశారు.. నిత్యం టచ్‌లోనే ఉన్నారు : బాంబు పేల్చిన సిద్దరామయ్య

ABN , First Publish Date - 2020-06-04T01:26:52+05:30 IST

కర్నాటకకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో యడియూరప్ప

బీజేపీ ఎమ్మెల్యేలు నన్ను కలిశారు.. నిత్యం టచ్‌లోనే ఉన్నారు : బాంబు పేల్చిన సిద్దరామయ్య

బెంగళూరు : కర్నాటక రాజకీయం సిద్దరామయ్య వ్యాఖ్యలతో కుదుపుకు గురైంది. ముఖ్యమంత్రి యడియూరప్ప పని తీరుపై ఉత్తర కర్నాటకకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉండి, తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే బుధవారం మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓ బాంబు పేల్చారు. బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు తనను కలిశారని, వారందరూ నిత్యం టచ్‌లోనే ఉన్నారని ఆయన బాంబు పేల్చారు.


వారందరు కూడా ముఖ్యమంత్రి యడియూరప్ప పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఈ విషయంలో మాత్రం తానేమీ చేయలేనని సిద్దరామయ్య వారితో అన్నట్లు సమాచారం. అయితే సిద్దరామయ్య వ్యాఖ్యలను, కర్నాటక రాజకీయాలను కాంగ్రెస్ నిశితంగానే పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం అంతా కూడా బీజేపీ అంతర్గత వ్యవహారమని, తాము యడియూరప్ప సర్కార్‌ను అస్థిరపరచే ప్రయత్నాలు ఎంతమాత్రమూ చేయమని తేల్చి చెప్పింది. 


సిద్దరామయ్య వ్యాఖ్యలపై కర్నాటక బీజేపీ శాఖ స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ మాట్లాడుతూ..... సిద్దరామయ్యపై తీవ్రంగా మండిపడ్డారు. ఓటమి నుంచి సిద్దరామయ్య ఇంకా కోలుకోవడం లేదని, అందుకే ఇలాంటి అర్థం పర్థం లేని మాటలను మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదే పదే ఇలాంటి వ్యాఖ్యలే ఆయన చేస్తున్నారని ఆరోపించారు.


ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనతో ఎందుకు కలుస్తారని ప్రశ్నించారు. తిరిగి ముఖ్యమంత్రి కావాలని సిద్దరామయ్య కలలు కంటున్నారని, అది సాధ్యమయ్యే పనికాదని తేల్చి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమారే ఆయనకు అడ్డని ఆరోపణలు చేశారు.


ఇలాంటి వ్యాఖ్యలతో కర్నాటక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కరోనాను ఎదుర్కోవడంపైనే యడియూరప్ప సర్కార్ ప్రస్తుతం దృష్టి సారించిందని, కేబినెట్ మొత్తం అహోరాత్రాలు మహమ్మారిపై పోరాడుతోందని పేర్కొన్నారు. సీఎం యడియూరప్పపై ఎవరూ అసంతృప్తిగా లేరని, ప్రభుత్వం స్థిరంగానే ఉంటుందని తేల్చ ప్రకాశ్ చెప్పారు. 


కర్నాటకకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో యడియూరప్ప తీవ్ర సతమతమవుతున్నట్లు సమాచారం. గతంలో కూడా ఇదే తలనొప్పి వచ్చినా సర్దుకుంది. అయితే ఈసారి మాత్రం మాజీ మంత్రి ఉమేశ్ కట్టి దీనికి మరింత ఆజ్యం పోస్తున్నట్లు సమాచారం. ఉమేశ్ కట్టి బలమైన లింగాయత్‌ వర్గానికి చెందిన నాయకుడు.


ఈయన సారథ్యంలో కొన్ని రోజుల క్రితం ఓ విందు జరిగింది. ఇందులో ఈయనతో ఏకీభవించే 20 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే వారెవ్వరూ బయటకు చెప్పనప్పటికీ వివిధ కారణాల రీత్యా, వివిధ అంశాలపై ఆ 20 మంది సీఎం యడియూరప్పతో విభేదిస్తున్నవారే అన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... వారందరూ యడియూరప్ప వ్యవహార శైలి, పనితీరుపై గుస్సాగా ఉన్నారు. అలాగే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమేశ్ కట్టిని కేబినెట్‌లోకి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


అంతేకాకుండా ఆయన తమ్ముడు రమేశ్ కట్టిని ఈసారి రాజ్యసభకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత హఠాత్ పరిణామాలతో అలర్ట్ అయిన యడియూరప్ప.... వెంటనే కట్టిని చర్చలకు పిలిచి, వివరణ అడిగినట్లు సమాచారం. ఇక, మరో సీనియర్ ఎమ్మెల్యే, లింగాయత్ వర్గానికి చెందిన బీఆర్ పాటిల్ కూడా యడియూరప్పపై తీవ్ర అసంతృప్తితో రగులుతున్నటు సమాచారం. అయితే ఈ హఠాత్ పరిణామంపై ప్రతిపక్షమైన కాంగ్రెస్, జేడీఎస్‌ నిశితంగా గమనిస్తున్నాయి. తమ సర్కారుకు వచ్చే ముప్పేమీ లేదని యడియూరప్ప వర్గం ధీమాతో ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2020-06-04T01:26:52+05:30 IST