బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ అలక.. ఏమైంది!?

ABN , First Publish Date - 2020-09-16T00:26:25+05:30 IST

తెలంగాణ బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ అలకబూనారు.

బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ అలక.. ఏమైంది!?

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ అలకబూనారు. దీంతో రెండ్రోజులుగా అసెంబ్లీకి కూడా హాజరుకాలేదు. తనకు రాష్ట్ర నాయకత్వం సహకరించడం లేదని.. సన్నిహితుల వద్ద ఆయన మొరపెట్టుకున్నట్లు తెలియవచ్చింది. అసెంబ్లీ వేదికగా వివిధ బిల్లులపై మాట్లాడటానికి తనకు సపోర్ట్ ఇవ్వడం లేదని రాజాసింగ్ అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ నేతలు, మంత్రులు కేంద్రంపై ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఉండలేకనే తాను అసెంబ్లీకి వెళ్లట్లేదని సన్నిహితుల వద్ద ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రత్యామ్నాయ పార్టీగా చెప్పుకుంటూ తనకు తగిన గౌరవం ఇవ్వని రాష్ట్ర నాయత్వంపై రాజసింగ్ గుర్రుగా ఉన్నారు. బీజేపీకి ఉన్న ఒకానొక్క ఎమ్మెల్యే పట్ల ఇలా వివక్ష తగదని రాజాసింగ్ అనుచరులు కమలనాథులపై మండిపడుతున్నారు.


అసలెందుకిలా..!?

వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానికి ముందే ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై రాష్ట్ర నేతలకు రాజాసింగ్ లేఖ రాశారు. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆ లేఖను అస్సలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో అసలు అసెంబ్లీ సమావేశాలకే హాజరుకాకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. కరోనా నియంత్రణలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యే అనుకున్నారు. తనకు రాష్ట్ర నాయకత్వం సహకరించలేదని.. అందుకే తాను కూడా పార్టీ నాయకత్వానికి సహకరించకూడదని ఆయన నిర్ణయించినట్లు తెలియవచ్చింది. ఈ క్రమంలోనే ఈ విషయాలన్నీ తన సన్నిహితులకు చెప్పుకున్న రాజాసింగ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారని తెలియవచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర, కేంద్ర నాయకత్వం స్పందించి ఆయనతో మాట్లాడి బుజ్జగిస్తారో లేదో.. వేచి చూడాలి.

Updated Date - 2020-09-16T00:26:25+05:30 IST