బ్రేకింగ్ : మైనర్ బాలిక రేప్ కేసులో ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేసిన BJP ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-06-04T18:56:34+05:30 IST

రాజధాని నడిబొడ్డున జరిగిన మైనర్‌ బాలికపై గ్యాంగ్ రేప్ (Gang Rape) ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది.

బ్రేకింగ్ : మైనర్ బాలిక  రేప్ కేసులో ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేసిన BJP ఎమ్మెల్యే

హైదరాబాద్ : రాజధానిలో నడిరోడ్డుపై మైనర్‌ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ (Gang Rape) ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి  రాగా.. తాజాగా ఫొటోలు, వీడియోలను బీజేపీ రిలీజ్ చేసింది. శనివారం నాడు హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు (Raghunandan Rao) ఈ ఫొటోలను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కేసును సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక వేళ ఇది జరగకుంటే తానే స్వయంగా సుప్రీంకోర్టకు వెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు. సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీజేఐ ఎన్వీ రమణకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.


బెంజ్ కారులో ఉన్నోళ్లను వదిలేసి..!

నా దగ్గరున్న సాక్ష్యాలను డీజీపీకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. విచారణ పారదర్శకంగా చేయాలని డీసీపీ జోయల్ డేవిస్‌ను కోరుతున్నాను. రెడ్  కలర్ మెరిసిడెస్ బెంజ్‌ కారులో ఎంఐఎం ఎమ్మెల్యే  కొడుకు ఉన్నాడు. నేను చూపిస్తున్న ఈ ఫోటోలో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు అవునో కాదో పోలీసులు చెప్పాలి..?. కానీ ఎమ్మెల్యే కొడుకు లేడని పోలీస్ అధికారులు ఎలా చెప్తారు..?. కోర్టు మాత్రమే చెప్పగలదు. జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఐపీఎస్ అధికారికి ఎక్కడిది..?. తప్పు చేసిన వారందరినీ శిక్షించాలని కేటీఆర్ ట్వీట్ చేశాడు. కానీ సొంత పార్టీ వాళ్ళను బొందపెట్టి.. కేటీఆర్ ప్రతిపక్షాలను కాపాడుతున్నాడు. పోలీసులు కూడా ఎంఐఎం నేతల పిల్లలను వదిలేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులను కీలు బొమ్మలుగా, రజాకార్ల వారసులు వాడుకుంటున్నారు. బెంజ్ కారులో ఉన్న వాళ్ళను వదిలేసి.. ఇన్నావో కారులో ఉన్నవాళ్ళను ముద్దాయిలుగా చూపుతున్నారు. పోలీసు అధికారులు రిపోర్టర్లను బెదిరించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేసులో పోలీసులు వక్ర భాష్యాలు చెబుతున్నారుఅని రఘునందనరావు చెప్పుకొచ్చారు.


వాళ్లను టచ్ చేయరేం..!?

అసలు గ్యాంగ్‌రేప్‌లో నిందితులు ఫొటోలను ఎందుకు సీక్రెట్‌గా ఉంచారు..?. నిర్భయ కేసులో మైనర్ ఉన్నా చూపించలేదా..?. అధికార పార్టీ, డబ్బులు ఉన్నవారి పిల్లలనే బయటికి చూపించడం లేదా..?. ఇప్పటి వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదు. హైదరాబాద్‌లో పోలీస్ కంట్రోలింగ్ మొత్తం మజ్లిస్ చేతిలో ఉంది. మజ్లిస్ నేతలు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారు. అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లను రిమాండ్ చేస్తారు కానీ.. ఎంఐఎం వాళ్లను టచ్ చేయరుఅని కేసీఆర్ సర్కార్, పోలీసు వ్యవస్థపై బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా.. ఈ కేసులోని మైనర్లు పోలీసులకు ఆ ఇన్నోవా కారును దొరక్కుండా దాచినట్లు తెలుస్తోంది. మరోవైపు.. నగరంలోని అన్ని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారని తెలియవచ్చింది. అయితే బీజేపీ నుంచి ఇన్నేసి ఆరోపణలు వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కార్, పోలీసు ఉన్నతాధికారులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Updated Date - 2022-06-04T18:56:34+05:30 IST