డెంగ్యూతో కన్నుమూసిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-12-13T03:04:58+05:30 IST

గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు డెంగీతో ప్రాణాలు విడిచారు. మెహన్సా జిల్లా ఉంఝా నియోజకవర్గానికి చెందిన

డెంగ్యూతో కన్నుమూసిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే

గాంధీనగర్: గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు డెంగ్యూ ప్రాణాలు విడిచారు. మెహన్సా జిల్లా ఉంఝా నియోజకవర్గానికి చెందిన ఆశాబెన్ పటేల్ (44) నేడు అహ్మదాబాద్‌లో మృతి చెందారు. డెంగ్యూతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్టు జైడస్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ వీఎన్ షా తెలిపారు. ఆమెను రక్షించుకోలేకపోయామని మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ విచారం వ్యక్తం చేశారు.


ఆశాబెన్ గతవారం ఢిల్లీని సందర్శించిన సమయంలో డెంగ్యూ సోకింది. దీంతో ఆమె ఉంఝాలోని సువిధ ఆసుపత్రిలో చేరారు. అయితే, పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోగా, ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం అహ్మదాబాద్‌లోని జైడస్ ఆసుపత్రికి తరలించారు.


అప్పటికే ఆమె అవయవాల్లో చాలా వరకు పాడైపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. ఆమెను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె మరణవార్తతో బీజేపీ నేతలు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.


మెహన్సా జిల్లాలోని విశోల్ గ్రామానికి చెందిన ఆశాబెన్ అవివాహితురాలు. తల్లి హీరాబెన్, ముగ్గురు అక్కలు, తమ్ముడితో కలిసి ఉంటున్నారు. ఆశాబెన్‌ మరణవార్త తెలిసి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2021-12-13T03:04:58+05:30 IST