Aodhya: అయోధ్యలో అక్రమంగా భూముల విక్రయం.. నిందితుల్లో బీజేపీ ఎమ్మెల్యే, మేయర్

ABN , First Publish Date - 2022-08-08T22:08:22+05:30 IST

అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద పర్యాటక స్థలంగా రూపుదిద్దుకోబోతోంది.

Aodhya: అయోధ్యలో అక్రమంగా భూముల విక్రయం.. నిందితుల్లో బీజేపీ ఎమ్మెల్యే, మేయర్

లక్నో: అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద పర్యాటక స్థలంగా రూపుదిద్దుకోబోతోంది. దీనిని సొమ్ము చేసుకోవాలని భావిస్తున్న ల్యాండ్ మాఫియా రంగంలోకి దిగిపోయింది. అయోధ్యలోనూ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూములను అక్రమంగా కొనుగోలు చేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. దీంతో అయోధ్యలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అనుమతుల్లేకుండా ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టి అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. 


ఇలా అక్రమంగా ప్లాట్లు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మందిలో మేయర్, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను మేయర్ రిషికేష్ ఉపాధ్యాయ్, ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ గుప్తా కొట్టిపడేశారు. అవి తప్పుడు ఆరోపణలని తేల్చి చెప్పారు. అథారిటీ ప్రాంతంలో అక్రమంగా భూములు కొనుగోలు చేసి విక్రయించి నిర్మాణ పనులు చేపట్టిన 40 మంది జాబితాను శనివారం రాత్రి అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ జారీ చేసిందని అథారిటీ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ తెలిపారు.


ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మందిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఈ ఆరోపణల వెనక కుట్ర దాగి ఉందని, తమను తప్పుడు కేసుల్లో ఇరికించారని ఉపాధ్యాయ్, గుప్తా పేర్కొన్నారు. అథారిటీ విడుదల చేసిన జాబితాలో మిల్కీపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోరఖ్‌నాథ్ బాబా పేరు కూడా ఉంది.  

 

ఈ ఆరోపణలపై స్పందించిన స్థానిక ఎంపీ లల్లు సింగ్ ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయోధ్యలో భూముల అక్రమ విక్రయంపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.


ల్యాండ్ మాఫియా సహకారంతో బీజేపీ నేతలు అయోధ్యంలో పాపానికి పాల్పడుతున్నారని, అక్రమంగా కాలనీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించింది. ఇప్పటి వరకు 30 కాలనీలను అక్రమంగా ఏర్పాటు చేశారని పేర్కొంది. అక్రమాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయలు మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతోందని ఆదేవన వ్యక్తం చేసింది. కాబట్టి ఈ దీనిపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Updated Date - 2022-08-08T22:08:22+05:30 IST