Public meetings: సిద్దరామోత్సవకు ధీటుగా ర్యాలీలు, సభలు

ABN , First Publish Date - 2022-08-09T18:01:52+05:30 IST

ప్రతిపక్షనేత సిద్దరామయ్య 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని దావణగెరె(Davanagere)లో నిర్వహించిన సిద్దరామోత్సవకు లభించిన

Public meetings: సిద్దరామోత్సవకు ధీటుగా ర్యాలీలు, సభలు

                               - బీజేపీ రాష్ట్ర కమిటీ కసరత్తు 

బెంగళూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత సిద్దరామయ్య 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని దావణగెరె(Davanagere)లో నిర్వహించిన సిద్దరామోత్సవకు లభించిన ఆదరణ బీజేపీలో కలకలం రేపుతోంది. సిద్దరామోత్సవపై అధిష్టానం పెద్దలు ఆరా తీసినట్టు సమాచారం. ప్రాంతాలవారీగా ర్యాలీలు, సభలు జరిపేందుకు బీజేపీ రాష్ట్ర కమిటీ కసరత్తు చేస్తోంది. ఈనెల 15న అమృత మహోత్సవ్‌ తర్వాత ముహూర్తం ఖరారు చేశారు. సీఎం బసవరాజ్‌ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌(Nalin Kumar Katil)తో కూడిన బృందం 50 రోజులు 50 నియోజకవర్గాలలో బహిరంగసభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సాధనా సమావేశాల పేరిట పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతోపాటు కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీల ఎమ్మెల్యేల ప్రాంతాల్లోనూ సభలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌(Congress) ఒక సభ ద్వారా ఏడెనిమిది ల క్షల మందిని సమీకరించిన తరుణంలో బీజేపీ అందుకు దీటుగా 50 నియోజకవర్గాల సభల ద్వారా అంతకంటే ఎక్కువ మందిని కలిసే ఆలోచనలో ఉంది. రానున్న రోజుల్లో ప్రతి అంశాన్ని భారీ సభల రూపంలోనే అమలు చేయాలని నిర్ణయించారు. ఉత్తరకర్ణాటకలోని కీలకమైన బెళగావికి చెందిన పార్టీ సీనియర్‌ నేత, కేఎల్‌ఈ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు ప్రభాకర్‌ కోరె జన్మదినాన్ని భారీగా జరిపేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో రెండు నెలల తర్వాత ఆయన పుట్టినరోజు కావడంతో బెళగావి కేంద్రంగా పలు జిల్లాలనుంచి పార్టీ కార్యకర్తలను రప్పించి సభను విజయవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధిష్టానం పెద్దలు ఇకపై తరచూ రాష్ట్ర పర్యటనకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‏సింగ్‌ సుర్జేవాలా త్వరలోనే బెంగళూరులో నివాసాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు. ఇందుకోసం వసంతనగర్‌లో పలు విలాసవంతమైన భవనాలను పరిశీలించారు. క్యాంప్‌ కార్యాలయం, పార్టీ అగ్రనేతలతో సమావేశాలు, జిల్లాలవారీగా సమీక్షలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో తరచూ భేటీలకు వీలుగా నివాసాన్ని ఏర్పాటు చేసుకోదలిచారు. సిద్దరామోత్సవ సభ వేడిని తగ్గించకుండా అమృత మహోత్సవ్‌ పేరిట నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్‌ పాదయాత్ర చేస్తుండడంతో బీజేపీ కూడా ఆ దిశగా సభల ద్వారానే ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించారు. 

Updated Date - 2022-08-09T18:01:52+05:30 IST