బీజేపీకి భారీ షాక్!... ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలోకి?...

ABN , First Publish Date - 2021-06-11T18:35:12+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్ తగలబోతున్నట్లు...

బీజేపీకి భారీ షాక్!... ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలోకి?...

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్ తగలబోతున్నట్లు సమాచారం. ఆ పార్టీ కీలక నేత ముకుల్ రాయ్ మళ్ళీ టీఎంసీలో చేరబోతున్నట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ముకుల్ రాయ్ ఆర్భాటంగా బీజేపీలో చేరారు. ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతోపాటు, ఆయన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నపుడు మమత బెనర్జీ అండగా నిలవడంతో ఆయన మనసు మారినట్లు తెలుస్తోంది. 


ముకుల్ రాయ్ తన కుమారుడు సుభ్రాంగ్షు రాయ్‌తోపాటు టీఎంసీలో శుక్రవారం చేరే అవకాశం ఉందని జాతీయ మీడియా చెప్తోంది. వీరిద్దరూ మమత బెనర్జీతో శుక్రవారం మధ్యాహ్నం భేటీ కాబోతున్నట్లు చెప్తోంది. 


శుక్రవారం ఉదయం టీఎంసీ వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మమత బెనర్జీ ఓ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో టీఎంసీ ఎంపీ, మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.


ముకుల్ రాయ్ ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆయన సతీమణి కూడా కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సమయంలో వారి కుటుంబానికి మమత బెనర్జీ, అభిషేక్ బెనర్జీ అండగా ఉన్నట్లు సుభ్రాంగ్షు ఇటీవల మీడియాకు చెప్పారు. 


ముకుల్ రాయ్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని  కృష్ణా నగర్ (ఉత్తర) నియోజకవర్గం నుంచి శాసన సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. ఆయన గతంలో రాజ్యసభ సభ్యునిగా, రైల్వే మంత్రిగా పని చేశారు. 

మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ముకుల్ రాయ్ బీజేపీలో ఉన్నప్పటికీ సువేందు అధికారి వంటివారి మాదిరిగా మమత బెనర్జీపై పరుష పదజాలాన్ని ఉపయోగించలేదు. 

Updated Date - 2021-06-11T18:35:12+05:30 IST