‘మూడు ముక్కలాట’లో నష్టపోతున్న బీజేపీ

ABN , First Publish Date - 2020-08-04T06:38:01+05:30 IST

ఏమైంది ఈ రాష్ట్రానికి? అవును, దేశమంతా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలని హేళన భావనతోచూసే పరిస్థితి ఉత్పన్నమైంది. రాజధాని విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ కూడబలుక్కుని...

‘మూడు ముక్కలాట’లో నష్టపోతున్న బీజేపీ

ఈ మూడుముక్కలాటలో భారతీయ జనతాపార్టీ వైఖరి ఆ పార్టీలో ఉన్న నాలాంటి ఎందరినో ఖిన్నులను చేస్తోంది. నిన్న కొత్త పార్టీ అధ్యక్షుడు ఢిల్లీలో మాట్లాడుతూ, ‘అమరావతి రైతులకు అండగా ఉంటాం, రాజధాని విషయం మాత్రం రాష్ట్రం నిర్ణయమే’ అని చెప్పడం విచిత్రంగా ఉంది. రైతులు పోరాటం చేస్తున్నదే రాజధాని కోసమే అయినపుడు ఇక మద్దతు దేనికిస్తున్నట్లు? ఈ గందరగోళం వల్ల విలువలతో కూడుకున్న బీజేపీ ఔన్నత్యాన్నే శంకించే పరిస్థితి ఏర్పడింది.


ఏమైంది ఈ రాష్ట్రానికి? అవును, దేశమంతా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలని హేళన భావనతోచూసే పరిస్థితి ఉత్పన్నమైంది. రాజధాని విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ కూడబలుక్కుని ప్రజల్ని భ్రమల్లో ఉంచి చేసిన నిర్వాకం ఇది. ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజు అత్యంత ఆత్మవిశ్వాసంతో ఒక మాట అన్నారు. ‘ఆరు నెలల్లోనే జనరంజకమైన పాలన అందించి దేశం యావత్తు ఈ రాష్ట్రం వైపు చూసేలా చేస్తాం’ అని. నిజమే ఈవేళ దేశం మొత్తం ఇటే వింతగా చూస్తోంది. అధికార బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే పవర్‌కు పదును పెట్టడం మొదలు పెట్టారు. కూల్చివేతలు, హద్దులు దాటుతున్న రద్దులు, అనాలోచిత నిర్ణయాలు, వ్యక్తిగత వేధింపులు.. వ్యవస్థల్ని అధీనంలో ఉంచుకోవడంతో మొదలైన ఈ రాజకీయ క్రీడ ఇప్పటికి మూడు రాజధానుల పంతం నెగ్గించుకోవలన్న ఒక నాటు పట్టింపు దాకా చేరింది. పార్టీ ప్రణాళికను భారత రాజ్యాంగం కన్నా మిన్నగా భావించి అందులో పేర్కొన్న అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నాం అని అందరినీ నమ్మిస్తున్న నాయకులు, మేనిఫెస్టోలో లేని ఈ మూడు రాజధానుల అంశానికి ఆత్యంత ప్రాధాన్యం ఇవ్వటమే ఇప్పుడు అందరి బుర్రలనూ తొలుస్తున్న ప్రశ్న. హైకోర్టు ఒక ప్రాంతంలో, అసెంబ్లీ ఒక ప్రాంతంలో ఉన్నంత మాత్రాన అవి రాజధానులుగా ఎలా పరిగణింపబడతాయో, ఇలాంటి ప్రయోగమే చేసిన కర్నాటకను పరిశీలిస్తే అర్థం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలకోసం భవనాలు నిర్మించిన హుబ్లి ధార్వాడ్లో అభివృద్ధి ఏమాత్రం విరాజిల్లిందో చూశాం. 13 జిల్లాలు కల్గిన, విడగొట్టబడిన ఒక చిన్న రాష్ట్రానికి రాజధాని, అన్ని ప్రాంతాలవారికీ సమదూరంలో ఉండాలని ప్రజలు కోరుకోవడం సహజం. న్యాయం కూడా. ఒరిస్సాకు దగ్గరలో ఉన్న విశాఖ

పట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఉండాలన్న తృష్ణ ఎందుకో సామాన్య ప్రజానీకానికి అర్థం కాని విషయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన క్రూరమైన తప్పును కూడా గుర్తు చేసుకోవాలి. అమరావతిలో కట్టినవన్నీ తాత్కాలిక నిర్మాణాలే, అసలు సింగపూర్‌ సినిమా ముందుంది అని చెప్పడం అధికార పార్టీ చేతికి చిక్కిన ఒక అస్త్రం అయ్యింది. కట్టినవన్నీ పక్కా నిర్మాణాలే అయినా, చంద్రబాబు అవన్నీ తాత్కాలిమే అని చెప్పడంతో తరలిపోవడానికి పెద్ద అడ్డంకి ఏదీ లేదనే వాదన అధికారపార్టీ చేయగలిగింది. ఇక భారీ ఎత్తున అమరావతిలో కుంభకోణాలు జరిగాయని పదే పదే ప్రచారం చేస్తున్న అధికారపార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారించి అందుకు కారకులైన వారిని జైల్లో ఎందుకు పెట్టలేదో ప్రజలకి అర్థం కాని ఇంకో విషయం.

ఈ మూడుముక్కలాటలో భారతీయ జనతాపార్టీ వైఖరి ఆ పార్టీలో ఉన్న నాలాంటి ఎందరినో ఖిన్నులను చేస్తోంది. జరుగుతున్న తతంగాన్నంతా దగ్గరగా గమనిస్తున్న బీజేపీ ఈ దోబూచులాట ఎందుకు ఆడుతున్నదో, ఆడిస్తున్నదో అంతుచిక్కని చిదంబర రహస్యం. మొన్నటి దాకా ఉన్న అధ్యక్షుడేమో రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని దీక్షలు చేశారు. ప్రెస్మీటింగులు పెట్టి ఒకటికి పదిసార్లు ప్రకటించారు. ఇప్పుడేమో రాజధాని కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, పార్టీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరని సరికొత్త ప్రవచనాలు వల్లిస్తున్నారు. ఇందువల్ల, బీజేపీపైన ప్రజల్లో ఉన్న నమ్మకం ఒక్కసారి క్రిందికి జారిపోయింది. నిన్న కొత్త పార్టీ అధ్య క్షుడు ఢిల్లీలో మాట్లాడుతూ, ‘అమరావతి రైతులకు అండగా ఉంటాం, రాజధాని విషయం మాత్రం రాష్ట్రం నిర్ణయమే’ అని చెప్పడం విచిత్రంగా ఉంది. రైతులు పోరాటం చేస్తున్నదే రాజధాని కోసమే అయినపుడు ఇక మద్దతు దేనికిస్తున్నట్లు? ఈ గందరగోళం వల్ల విలువలతో కూడుకున్న బీజేపీ ఔన్నత్యాన్నే శంకించే పరిస్థితి ఏర్పడింది. అంతేకాక చంద్రబాబు పిలిస్తేనే ప్రధానమంత్రి మంత్రి వచ్చి శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టారని చెప్పడంతో ప్రజల్లో కొత్త అనుమానాలు రేకెత్తించిన వాళ్ళ మయ్యాం. 1500 కోట్లు కేంద్ర నిధులు, కేంద్ర సంస్థలైన ఐఐటీ, ఐఐఎం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం మంజూరు చేయడం, అమరావతికి నిధులు సమకూర్చుకోవడం కోసం స్టాక్‌ మార్కెట్‌లో బాండ్స్‌ అమ్మకానికి అనుమతి ఇవ్వడం, హైకోర్టు, కంపెనీ లా కోర్టు.. ఇవన్నీ అమరావతి రాజధాని అనే కదా మంజూరు చేసింది. ఇవిగాక అనుబంధంగా వివిధ బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలు, ప్రతిష్ఠాత్మకయిన విశ్వవిద్యాలయాలు వచ్చింది ఎందుకోసం? కులాల పేరుతో కొట్టుమిట్టాడుతున్న రెండు ప్రాంతీయ పార్టీలకు రాజధాని ట్యాగ్‌ అవుతున్న ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీ అయిన బీజేపీ ప్రస్తుత వైఖరి ఏపీలో ఆత్మహత్యాసదృశమే. పార్టీకి ఇప్పుడిపుడే లభిస్తున్న ప్రజాదరణ పోయే ప్రమాదం ఉంది. 78 శాతం దాకా (ఇటీవలి సి ఓటర్‌ సర్వే ప్రకారం) ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణ పొందుతున్న బీజేపీ, మిగిలిన పార్టీల వలే గాకుండా ఉండాలని కోరుకోవడం తప్పుకాదనుకుంటాను. సిద్ధాంతాల ప్రాతిపదికగా పనిచేస్తున్న నాయకుల, కార్యకర్తల మనోభావాలను గౌరవించి, బీజేపీ అంటే ఒకే మాట ఒకే బాట అన్న ఏకైక నినాదంతో రాష్ట్ర ప్రజలకు అండగా ఉండడం ఇప్పటి అవసరం అని భావిస్తున్నాను. 

డాక్టర్‌. ఓ.వి.రమణ

టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, 

భారతీయ జనతా పార్టీ నాయకుడు

Updated Date - 2020-08-04T06:38:01+05:30 IST