మధ్యప్రదేశ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం

ABN , First Publish Date - 2020-11-10T21:09:56+05:30 IST

మధ్య ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వానికి గండం తప్పింది.

మధ్యప్రదేశ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం

న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వానికి గండం తప్పింది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన స్థానాలు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఢోకా లేదని ఆ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. 


బీజేపీ ప్రభుత్వం అదికారంలో కొనసాగాలంటే, ఉప ఎన్నికలు జరిగిన 28 శాసన సభ స్థానాల్లో కనీసం ఎనిమిదింటిని బీజేపీ దక్కించుకోవలసి ఉంది. అయితే ఐదింటిలో విజయం సాధించి,  14 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ 8 స్థానాల్లోనూ, బీఎస్‌పీ ఒక స్థానంలోనూ ఆధిక్యంలో కనిపిస్తున్నాయి. 


ఇదిలావుండగా, శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు అయిదల్ సింగ్ కన్సానా, గిర్రజ్ డండోటియా, ఓపీఎస్ భడోరియా తమ కాంగ్రెస్ ప్రత్యర్థుల కన్నా వెనుకంజలో ఉన్నారు. డబ్రా నియోజకవర్గంలో బీజేపీ మహిళా నేత ఇమారతీ దేవి ఆధిక్యంలో ఉన్నారు. 


గుజరాత్‌లో 8 శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఓట్ల లెక్కింపు ఫలితాలనుబట్టి ఈ అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు విజయ చిహ్నాలు చూపిస్తూ, సంబరాలు చేసుకుంటున్నారు. దీపావళి తమకు ముందుగానే వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాల ప్రభావం ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రభుత్వ మనుగడపై ఉండదన్న సంగతి తెలిసిందే.


మధ్య ప్రదేశ్‌లో 229 ఎమ్మెల్యేల శాసన సభలో ప్రభుత్వ ఏర్పాటుకు 115 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కనీసం 8 మంది ఎమ్మెల్యేలు అదనంగా మద్దతివ్వవలసి ఉంది. తాజా ఉప ఎన్నికల ఫలితాల ధోరణినిబట్టి బీజేపీ ప్రభుత్వ మనుగడకు ఢోకా లేదని స్పష్టమవుతోంది. 


Updated Date - 2020-11-10T21:09:56+05:30 IST