వలంటీర్లను దూరంగా ఉంచండి

ABN , First Publish Date - 2021-04-16T09:58:26+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అధికార పక్షం వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కకేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

వలంటీర్లను దూరంగా ఉంచండి

తిరుపతిలో వైసీపీ  అధికార దుర్వినియోగం

ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అధికార పక్షం వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కకేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. గ్రామ వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కోరారు. గురువారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్రతో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధరన్‌ తదితర నేతలు ఈసీతో సమావేశమయ్యారు. వైసీపీకి ఓటేయాలని వలంటీర్లు ప్రచారం చేస్తున్నారని, దీనిపై ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.


ఎన్నికల విధుల్లో వారిని వినియోగించవద్దని ఇప్పటికే ఆదేశించినట్లు ఈసీ తమకు తెలిపిందని, పర్యవేక్షకుడిగా ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని కూడా నియమించినట్లు సమాచారమిచ్చిందని బీజేపీ నేతలు విలేకరులకు తెలిపారు. 877 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిధిలో కేంద్ర బలగాలను మోహరిస్తున్నామని తెలిపిందన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామని..


వలస వెళ్లినవారి పేర్లను సేకరించి వైసీపీ నేతలు తప్పుడు ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. హిందూ దళితులకు మాత్రమే రిజర్వేషన్లు లభిస్తాయని, దళితులు మాత్రమే పోటీ చేయాల్సిన తిరుపతి రిజర్వు స్థానంలో ఇతర మతానికి చెందిన గురుమూర్తిని వైసీపీ తమ అభ్యర్థిగా పోటీ చేయించడం సరికాదన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని ఈసీని కోరినట్లు వెల్లడించారు.

Updated Date - 2021-04-16T09:58:26+05:30 IST