పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పరిస్థితి: Vijayashanti

ABN , First Publish Date - 2022-04-09T13:51:00+05:30 IST

సీఎం కేసీఆర్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని బీజేపీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు.

పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పరిస్థితి: Vijayashanti

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని బీజేపీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఫేస్‌బుక్‌ వేదికగా ముఖ్యమంత్రిపై విజయశాంతి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ధర్నాలు వద్దన్న సీఎం... ఇప్పుడు స్వయంగా ధర్నాలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.  రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ నేతగా  గొప్ప‌లు చెప్పుకునే కేసీఆర్... ఇప్పుడు ప్రజలు అసహ్యించుకునే స్థితికి దిగజారారని అన్నారు. అందుకే కొత్త నాటకాన్ని షూరు చేసి, తెలంగాణ ప్ర‌జ‌ల్ని మ‌రోసారి మోసం చేయాల‌ని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మీద నింద‌లు వేస్తూ రాజ‌కీయ పబ్బం గ‌డుపుకోవాల‌ని ఆలోచన  చేస్తున్నారన్నారు. తెలంగాణ‌లో అన్ని అనర్థాలకు కారణం ముఖ్యమంత్రి అతి విశ్వాసమే అని అన్నారు. అబద్దాల పుట్ట అయిన కేసీఆర్ మాటల్ని ఎవరూ నమ్మడం లేదని... అందుకే కొత్తగా వడ్ల నాటకం మొదలుపెట్టారని విరుచుకుపడ్డారు. కేంద్రం ఎక్క‌డా వ‌డ్లు కొన‌నని చెప్ప‌లేదని  బీజేపీ నేత స్పష్టం చేశారు. కేసీఆర్ స‌ర్కార్ కేంద్ర ప్ర‌భుత్వం మీద కావాల‌నే  త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పీకే సర్వేలో తేలినందునే పంజాబ్ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహించారు. 


కేసీఆర్ బీజేపీ గొంతు నొక్కాలని చూస్తే... ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఇప్ప‌టికే హుజూరాబాద్ ప్ర‌జ‌లు కేసీఆర్‌కు క‌ర్ర కాల్చి వాతపెట్టారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఉంటే అధికారపార్టీ లొసుగులు బయటపెడతార‌నే భయంతోనే సస్పెన్షన్ పేరుతో బయటకు పంపారన్నారు. రానున్న ఎన్నికల్లో హుజూరాబాద్ ఫలితాలే రాష్ట్రమంతా పునరావృతం అవుతాయని తేల్చిచెప్పారు. కుర్చీ, కుటుంబం, లక్షల కోట్ల సంపాదన కోసమే కేసీఆర్ ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే... వాళ్లు ఆ మట్టితోనే కేసీఆర్ స‌ర్కార్‌కి బొందపెట్టి తగిన బుద్ధి చెబుతారని విజయశాంతి హెచ్చరించారు.


Updated Date - 2022-04-09T13:51:00+05:30 IST