తెలంగాణలో బీమా పథకం ఏమైందో చెప్పాలి...

ABN , First Publish Date - 2022-06-17T02:18:39+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో బీమా పథకం ఏమైందో చెప్పాలని బీజేపీ నేత విజయశాంతి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. రైతుల సంక్షేమంపై లేదని..

తెలంగాణలో బీమా పథకం ఏమైందో చెప్పాలి...

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీమా పథకం ఏమైందో చెప్పాలని బీజేపీ నేత విజయశాంతి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. రైతుల సంక్షేమంపై లేదని విమర్శించారు. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్రం మీద కక్షతో తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతున్నారని దుయ్యబట్టారు. గురువారం ఆమె సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే..


‘‘కేసీఆర్ రాజ‌కీయ‌లు త‌ప్ప.. ప్ర‌జ‌ల‌కు ప‌నికి వ‌చ్చేది ఒక్క‌టి కూడా చేయ‌డం లేదు. ఆయన అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అన్నదాత‌లు అరిగోస‌లు ప‌డుతూనే ఉన్నరు. సీఎం సారుకు జాతీయ రాజ‌కీయ‌ల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేదు. తాజాగా పునాసల సీజన్‌‌‌‌ షురువైనా పంటల బీమా అమలుపై కేసీఆర్ స‌ర్కార్ ఎటూ తేల్చడం లేదు. ఈ సీజన్​లో మే 5 నాటికే విడుదల కావాల్సిన పంటల బీమా నోటిఫికేషన్ ఇప్పటికీ రాలేదు. గ‌త రెండేండ్లుగా ఫసల్ బీమా యోజనను కేసీఆర్ స‌ర్కార్ అమలు చేయడం లేదు. బెంగాల్ తరహాలో మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా పంటల బీమా పథకం తెస్తమని చెప్తున్నా.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. దీంతో పంటలకు బీమా లేక... అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో ఏటా మన రైతులు నష్టపోతున్నరు.


‘‘కేంద్రం మీద కక్ష‌తో తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతున్నరు. రైతులకు భరోసా ఇవ్వడం కోసం పంటల బీమా తప్పనిసరిగా అమలు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. గతంలో జాతీయ పంటల బీమా పథకం అమలులో ఉండగా, 2016 నుంచీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా, యూనిఫైడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (యూ‌‌‌‌ఐ‌‌‌‌ఎస్) పథకాలు అమలయ్యాయి. రాష్ట్రంలో 2016 నుంచి 2019 వరకు నాలుగేళ్ల పాటు ఫసల్‌‌‌‌ బీమా పథకాన్ని అమలు చేశారు. ఆ తర్వాత 2020 వానాకాలం నుంచీ పంటల బీమా పథకాలన్నింటినీ పక్కన పెట్టేశారు. అలా ఎందుకు చేశారో ఇంతవ‌ర‌కు కేసీఆర్ స‌ర్కార్ చెప్ప‌లేదు. రాష్ట్ర రైతులు 2020 ఖరీఫ్, రబీ సీజన్లలో భారీ వర్షాలు, వడగండ్లు, ఈదురు గాలులతో తీవ్రంగా నష్టపోయారు.


‘‘2021లో పలు జిల్లాలో అకాల వర్షాల వల్ల వరి, పత్తి, మిరప రైతులకు తీవ్ర నష్టం కలిగింది. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నయి. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించిన మంత్రులు... పరిహారం అందిస్తమని హామీలిచ్చి చేతులు దులుపుకున్నరు. ఇన్​పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం బంద్ పెట్టింది. గడిచిన రెండేండ్లలో పంటల బీమాకు బడ్జెట్​లో రూపాయి కూడా కేటాయించలేదు. దీని వ‌ల్ల తెలంగాణ రైతులు ఎన్నో విధాలుగా న‌ష్ట‌పోయారు. కేసీఆర్... మోడీగారి మీద విమ‌ర్శ‌లు చేయ‌డం కాదు, ముందు ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌ను అమ‌లు చేయి. రాజ‌కీయ‌ల‌తో ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్న కేసీఆర్‌కి రైత‌న్న‌లు క‌ర్రు కాల్చి వాత పెట్టాడం ఖాయం’’. అని విజయశాంతి పేర్కొన్నారు.



Updated Date - 2022-06-17T02:18:39+05:30 IST