Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 22 2021 @ 17:48PM

‘పోడు’.. గోడు పట్టదా..?: Vijayashanti

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజల భూములను లాక్కున్నారని.. వాటిని తిరిగి ఇప్పిస్తానని పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులకు కేసీఆర్ హామీ ఇచ్చారని.. కానీ గెలిచాక మాట తప్పారని విమర్శించారు. పూర్తి వివరాలు.. ఆమె మాటల్లోనే.. ‘‘ పోడు భూములకు పట్టాలిస్తామని అడవి బిడ్డలకు హామీనిచ్చి, ఎన్నికల్లో గెలిచాక... కేసీఆర్ స్వయంగా మూడుసార్లు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పోడు ప్రాంతాల్లో కుర్చీ వేసుకొని అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తానన్నారు. కానీ.. అవే భూముల్లో అంగుళం కూడా వదలకుండా హరితహారం మొక్కలు నాటాలని ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో ప్రతి ఏటా పంటలు వేసేందుకు గిరిజనులు, మొక్కలు నాటేందుకు ఫారెస్టోళ్లు భూముల్లోకి దిగుతుండడంతో గొడవలు జరుగుతున్నాయి. తమ భూముల జోలికి రావద్దని ఫారెస్టోళ్లను పోడు రైతులు కాళ్లావేళ్లా పడి వేడుకుంటున్నా వినడం లేదు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గిరిజన రైతులపై హత్యాయత్నం కింద నాన్ ​బెయిలబుల్ ​కేసులు పెట్టి పోలీస్​ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.


రాష్ట్రంలో వందలాది పోడు రైతులు అటు భూములు పోయి, ఇటు కేసులపాలై దయనీయంగా బతుకుతున్నారు. పొట్టకూటి కోసం తరతరాలుగా తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కులు కల్పించాలని అడుగుతున్న అడవి బిడ్డలకు రాష్ట్ర సర్కారు పట్టాలియ్యకపోగా.. ఉల్టా కేసులు పెట్టి సతాయించడం సిగ్గుచేటు. గర్భిణులు, చంటి పిల్లల తల్లులు, వృద్ధులు అని కూడా చూడకుండా కటకటాల పాలు చేయడం చూస్తుంటే.. పోడు రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతుంది.


ఇదే పోడు భూముల సమస్యపై సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం గుర్రంబోడు గిరిజనులు పోరాటానికి దిగితే... వారిపై కక్ష పూరితంగా కేసులు నమోదు చేసి.. వారికి మద్దతుగా పోరాడిన బీజేపీ నాయకులపై కేసులు బనాయించి జైలుకు తరలించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోడు భూముల సమస్యపై సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. కేవలం హుజురాబాద్ ఎన్నికలపైనే దృష్టి పెట్టి, కులాల వారిగా ఓట్లను ఎలా రాబట్టాలనే ఆలోచనతో ఉన్నారు. కావున యావత్ తెలంగాణ పోడు రైతులు కంకణబద్ధులై, టీఆర్ఎస్ పాలనకు తగిన బుద్ది చెప్పాలి’’ అని విజయశాంతి పేర్కొన్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement