ప్రయివేటు టీచర్ల జీవితం దుర్భరంగా మారుతోంది: విజయశాంతి

ABN , First Publish Date - 2021-04-09T23:48:05+05:30 IST

తెలంగాణలో ప్రయివేటు టీచర్ల దుస్థితిపై తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. వారి గోడు సర్కారుకు పట్టడం లేదని, కంటితుడుపు చర్యలు తప్ప వారి కష్టాలు తొలగించేందుకు...

ప్రయివేటు టీచర్ల జీవితం దుర్భరంగా మారుతోంది: విజయశాంతి

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రయివేటు టీచర్ల దుస్థితిపై తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. వారి గోడు సర్కారుకు పట్టడం లేదని, కంటితుడుపు చర్యలు తప్ప వారి కష్టాలు తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో.. ‘గత ఆరేడు నెలలుగా ప్రయివేటు టీచర్ల జీవితం అత్యంత దారుణంగా దిగజారిపోయింది. వరుస ఆత్మహత్యలు, పాలకుల పట్టింపులేనితనంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో ఏదో తూతూ మంత్రంగా రాష్ట్ర సర్కారు వారికి రూ.2 వేలు డబ్బు, 25 కిలోల బియ్యం సాయంగా ప్రకటించింది. కరోనా పరిస్థితుల వల్ల కిందటేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ 30 మంది ప్రయివేటు టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. 


మరెందరో ఉద్యోగాలు కోల్పోయి నేటికీ బండ్లు నడుపుకుంటూ, కూరలమ్ముకుంటూ, కూలీలుగా ఇలా బతుకు గడవడానికి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల మార్గాలు వెదుక్కుంటున్నారు. ఈ పరిస్థితులపై మీడియాలో మొదటి నుంచీ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పుడే సర్కారు మేల్కొని వారికి అండగా పాలకులు ఉన్నారనే భరోసా కాస్తయినా ఇచ్చి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు. 


ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరిచ్చే 2 వేలు ఆ కుటుంబాలకు ఏమూలకు సరిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ టీచర్లయినా, ప్రయివేటు టీచర్లయినా సమాజంలో గురువు స్థానం ఎప్పటికీ ఉన్నతమైనదేనని ముందుగా ప్రభుత్వం గుర్తించాలి. కేవలం కాస్త డబ్బు, బియ్యం ఇస్తే వారి కన్నీరు ఆగదు. టీచర్లు గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పించినప్పుడే వారికి నిజమైన సంతృప్తి. సర్కారు ఈ దిశగా ప్రయత్నించాలి’ అని పేర్కొన్నారు.



Updated Date - 2021-04-09T23:48:05+05:30 IST