తిరుపతి: జగన్ సర్కారుపై బీజేపీ నేత సునీల్ దేవదర్ అతి భక్తి ప్రదర్శించారు. రైతుల మహా పాదయాత్రలోఎవరూ పాల్గొనవద్దని ఏపీ బీజేపీ నేతలపై సునీల్ దేవదర్ ఒత్తిడి చేస్తున్నారు. రైతులకు మద్దతు పలకాల్సిన అవసరం లేదని సునీల్ దేవదర్ ఫోన్ చేసి చెప్తున్నట్లు తెలుస్తోంది. యాత్రను ఆడ్డుకోవాలని చూస్తున్న పోలీసులకు సహకరించేందుకే.. తమను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. సునీల్ దేవదర్ హెచ్చరికలను ఖాతరు చేసేదిలేదని బీజేపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. యాత్రలో పాల్గొంటామని, అమరావతిని కాపాడుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది. ఆదివారం నాటికి 14వ రోజుకు చేరింది. అమరావతే ఏకైక రాజధాని లక్ష్యంగా ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరిట రైతులు పాదయాత్ర చేపట్టారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజవర్గాలు దాటి ఆదివారం కొండేపి నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టనుంది. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీ ఎత్తున మహిళలు తరలివస్తున్నారు.