Abn logo
Jan 13 2021 @ 07:39AM

హైదరాబాద్‌లో బీజేపీ నేత ఆత్మహత్య.. అసలేం జరిగింది!?

హైదరాబాద్/హయత్‌నగర్‌ : భూ వివాదం, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, బీజేపీ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నారు. తుర్కయాంజల్‌ మున్సిపాలిటీలోని తొర్రూర్‌ గ్రామానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సంరెడ్డి వెంకట్‌రెడ్డి (65) గ్రామంలో తన వ్యవసాయ భూమి పక్కనే ఉన్న ఎకరంన్నర భూమికి సంబంధించి పక్క రైతు వద్ద అగ్రిమెంటు చేసుకున్నట్లు తెలిసింది. అందుకోసం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వద్ద సుమారు రూ. కోటి తీసుకువచ్చి వాటికి మరో రూ. 30 లక్షలు కలిపి రైతుకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏళ్లు గడుస్తున్నా సదరు రైతు భూమిని రిజిస్ర్టేషన్‌ చేయకుండా, తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నట్లు తెలిసింది. కొంత కాలంగా ఇద్దరి మధ్య భూ వివాదం నడుస్తోంది. మంగళవారం తీవ్ర మనస్తాపానికి గురైన వెంకట్‌రెడ్డి తన పొలం వద్ద ఒంటి పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. వెంకట్‌రెడ్డి పూర్తిగా కాలిపోయాడు. స్థానికులు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 5 గంటలకు వెంకట్‌రెడ్డి మృతి చెందాడు.

రియల్‌ కంపెనీలకు సుపరిచితుడు

సంరెడ్డి వెంకట్‌రెడ్డి నగరంలోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు భూములు ఇప్పిస్తాడు. శ్రీమిత్ర, జన చైతన్య, స్పెకా్ట్ర, జీపీఆర్‌ లాంటి పెద్ద సంస్థలకు ఆయన అనేక వేల ఎకరాల భూములు ఇప్పించినట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన తొర్రూర్‌ గ్రామం నుంచి ఎన్నికల బరిలో దిగి ప్రత్యర్థి గుండెల్లో దడ పుట్టిస్తాడు. గత సంవత్సరం జరిగిన తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేశాడు. టీడీపీలో క్రియాశీలంగా పని చేసిన వెంకట్‌రెడ్డి ఇటీవల బీజేపీలో చేరాడు. కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడి పోయాడు. వెంకట్‌రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement