Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలతో.. Gulf లో భారత ప్రతిష్ఠకు మసక!

ABN , First Publish Date - 2022-06-07T13:26:05+05:30 IST

మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు భారత్‌కు అత్యంత కీలకమైన గల్ఫ్‌ దేశాల్లో అనూహ్యంగా దుమారం రేపాయి. ఎడారి దేశాల్లో శరవేగంగా చోటు చేసుకుంటున్న దౌత్య పరిణామాలు స్వదేశంలో ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రాన్ని కూడా అందించాయి. నిజానికి, గల్ఫ్‌ దేశాలు ఇప్పటి వరకూ ఎప్పుడూ భారత రాయబారులకు...

Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలతో.. Gulf లో భారత ప్రతిష్ఠకు మసక!

సమన్లు జారీ చేసిన నాలుగు దేశాలు

జీసీసీ సహా మరికొన్ని దేశాల ఖండన

దిద్దుబాటు చర్యలతో కాస్త ఊరట

మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు భారత్‌కు అత్యంత కీలకమైన గల్ఫ్‌ దేశాల్లో అనూహ్యంగా దుమారం రేపాయి. ఎడారి దేశాల్లో శరవేగంగా చోటు చేసుకుంటున్న దౌత్య పరిణామాలు స్వదేశంలో ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రాన్ని కూడా అందించాయి. నిజానికి, గల్ఫ్‌ దేశాలు ఇప్పటి వరకూ ఎప్పుడూ భారత రాయబారులకు సమన్లు జారీ చేయలేదు. సాధారణంగా ఏ మిత్ర దేశం కూడా రాయబారులను పిలిపించి అసంతృప్తి వ్యక్తం చేయదు. కానీ, ఈసారి ఏకంగా నాలుగు దేశాలు సమన్లు జారీ చేశాయి. ఖతర్‌, కువైత్‌, ఒమాన్‌, ఇరాన్‌ దేశాలు భారత రాయబారులను పిలిచి అధికారికంగా తమ నిరసన వ్యక్తం చేశాయి. సౌదీ అరేబియా, యూఏఈతోపాటు ఆరు గల్ఫ్‌ దేశాల సహాయక మండలి (జీసీసీ) నుపుర్‌ వ్యాఖ్యలను ఖండించింది. జోర్డాన్‌, మాల్దీవులు, ఇండోనేసియా కూడా ఖండించాయి. బీజేపీ ప్రతినిధులను తొలగించడాన్ని బహ్రెయిన్‌ స్వాగతించింది.


మొదలైంది ఇలా..

గల్ఫ్‌లోనే చిన్న దేశమైన ఖతర్‌ ఈ వివాదానికి శ్రీకారం చుట్టింది. అరబ్బు ప్రపంచంలో పెత్తనం కోసం ప్రయత్నించే ఖతర్‌.. తన ఆధ్వర్యంలో నడిచే అల్‌ జజీరా చానల్‌ ద్వారా నుపుర్‌ శర్మ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రసారం చేయించింది. వివాదాన్ని అరబ్బు ప్రపంచం దృష్టికి తీసుకెళ్లింది. అది కూడా.. కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేతృత్వంలోని అత్యున్నత స్థాయి అధికారిక బృందం అడుగు పెట్టిన సమయంలో దీనిని వెలుగులోకి తెచ్చింది. దాంతో, శనివారం రాత్రి ఉప రాష్ట్రపతి బృందం చేరుకోగా.. కొన్ని గంటల్లోనే భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ను ఖతర్‌ పిలిపించింది. తమ నిరసన పత్రాన్ని అందజేసింది. ఈ పరిణామంపై భారతీయ అధికారులు నిర్ఘాంతపోయారు. విచిత్రం ఏమిటంటే, సమన్లు జారీ చేసిన సహాయ మంత్రి సుల్తాన్‌ అల్‌ మురేఖీ అంతకు కొన్ని గంటల ముందు ఖతర్‌ ప్రభుత్వం తరఫున వెంకయ్య నాయుడుకు అధికారికంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో ఆయన వెంట దీపక్‌ మిట్టల్‌ కూడా ఉన్నారు. ఖతర్‌లో జరిగిన పరిణామాలను ఎంబసీ నివేదించిన వెనువెంటనే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరిపై బీజేపీ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2022-06-07T13:26:05+05:30 IST