వేరే దేశం జెండా పోస్టు చేసి దొరికిపోయిన కుష్బూ!

ABN , First Publish Date - 2021-01-26T23:17:10+05:30 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్విటర్ వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలకు తెలిపేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత కుష్బూకి ...

వేరే దేశం జెండా పోస్టు చేసి దొరికిపోయిన కుష్బూ!

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్విటర్ వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలకు తెలిపేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత కుష్బూకి ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె పెట్టిన పోస్టులో భారత జెండా బదులు అచ్చం అదే రంగులను పోలిన నైగర్ దేశం జెండాను పెట్టడంతో నెటిజన్లు పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. భారత్, నైగర్ జాతీయ పతాకాల్లో ఒకే విధంగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నప్పటికీ... మధ్యలో చిహ్నం మాత్రం తేడా ఉంటుంది. భారతదేశ పతాకం మధ్యలో 24 ఆకులతో నేవీ బ్లూ రంగులో అశోక చక్రం ఉంటుంది. నైగర్ జెండాలో కాషాయం రంగులో వృత్తాకారం ఉంటుంది. రెండూ జెండాలు ఒకే పోలికతో ఉండడంతో కుష్బూ తన ట్వీట్‌లో పొరపాటున నైగర్ జెండాలను పెట్టారు. దీంతో నెటిజన్లు రకారకాల కామెంట్లతో ఆమెకు క్లాస్ పీకడం మొదలుపెట్టారు.


‘‘నయా భారత్‌లో భారత పతకం కూడా మారిపోయిందా..’’ అని ఓ నెటిజన్ ప్రశించగా... ‘‘మీరు పార్టీ మారారని తెలుసు.. కానీ ఇప్పుడు ఏకంగా దేశం కూడా మారారా?’’ అని మరో వ్యక్తి వ్యంగ్యాస్త్రం సంధించాడు. ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అన్నీ చూసుకోవాలంటూ మరికొందరు ఆమెకు సలహాలు ఇచ్చారు. ఇలా వరుసబెట్టి నెటిజన్లు విమర్శలు కురిపిస్తుండడంతో కుష్బూ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసేశారు. తన పొరపాటును అంగీకరిస్తూ క్షమాపణ కోరారు. ‘‘ట్వీట్ చేసేటప్పుడు కళ్లద్దాలు పెట్టుకోలేదు. ఇది ఆమోదయోగ్యం కానప్పటికీ.. మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నాను..’’ అని కుష్బూ మరో ట్వీట్ పెట్టారు.  ‘‘నా దేశం.. నా ఇండియా..’’ అంటూ ఆమె తన ప్రొఫైల్ పిక్‌‌లో సైతం జాతీయ జెండాను పెట్టడం కొసమెరుపు!









Updated Date - 2021-01-26T23:17:10+05:30 IST