దాడులకు భయపడే అవినీతిపై మౌనం

ABN , First Publish Date - 2022-06-04T13:36:20+05:30 IST

ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, ఆ పార్టీ ప్రధాన మిత్రపక్షం బీజేపీ మధ్య అసంతృప్తి జ్వాలలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ఇటీవల అన్నాడీఎంకే

దాడులకు భయపడే అవినీతిపై మౌనం

                            - బీజేపీ నేత దురైసామి


చెన్నై, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, ఆ పార్టీ ప్రధాన మిత్రపక్షం బీజేపీ మధ్య అసంతృప్తి జ్వాలలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ఇటీవల అన్నాడీఎంకే సీనియర్‌ నేత పొన్నయ్యన్‌ బీజేపీతో పొత్తు కారణంగానే తమపార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని విమర్శించారు. వెంటనే బీజేపీ రాష్ట్ర నాయకుడు అన్నామలై స్పందిస్తూ ఆ విమర్శలు పొన్నయ్యన్‌ వ్యక్తిగత వెల్లడించిన అభిప్రాయమేనని, అన్నాడీఎంకే అధిష్టానం అభిప్రాయం కాదని బదులిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీపీ దురైసామి తాజాగా అన్నాడీఎంకేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే ప్రభుత్వం ఏసీబీ దాడులు చేయిస్తుందన్న భయంతోనే శాసనసభలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పాలకుల అవినీతిపై మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా శాసనసభలో డీఎంకే ప్రభుత్వ అవినీతిని ఎండగడుతుంటూ అన్నాడీఎంకే సభ్యులంతా ఇప్పటివరకూ మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు. నామక్కల్‌ జిల్లా రాశిపురంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, అన్నాడీఎంకే మధ్య ప్రస్తుతం ఎలాంటి విబేధాలు లేవన్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి పొన్నయ్యన్‌ చేసిన విమర్శలు రెండు పార్టీల మధ్య చిచ్చు రగిల్చే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రజల కోసం, రైతుల కోసం పలు ఆందోళనలు నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలో నిర్బంధ హిందీ అమలుపై కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే నేతలు ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయకుండా కేవలం ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. శాసనసభలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు విద్యుత్‌, విద్యాశాఖల్లో చోటుచేసుకున్న అవినీతిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని, ఇంత జరుగుతున్నా అన్నాడీఎంకే సభ్యులు నోరుమెదపలేదని దురైసామి విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీకి ప్రజాభిమానం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు.


ఓపీఎస్‌ ఖండన...

బీజేపీ ఉపాధ్యక్షుడు వీపీ దురైసామి చేసిన విమర్శలనుఅన్నాడీఎంకే సమన్వయకర్త ఒ. పన్నీర్‌సెల్వం  తీవ్రంగా ఖండించారు. దురైసామి పాతచరిత్ర పరిశీలిస్తే ఎంతటి నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడో అందరికీ తెలుస్తుందని, స్వార్థంతో ఊసరవెల్లిలా పార్టీలు మార్చే దురైసామి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకేపై విమర్శలు చేయడం గర్హనీయవన్నారు. శాసనసభలో అన్నాడీఎంకే సభ్యులు వ్యవహరిస్తున్న తీరును అన్ని వర్గాలవారు ప్రశంసిస్తున్నారని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు సభలో పాలకపక్షాన్ని నిలదీస్తున్నామని పన్నీర్‌సెల్వం తెలిపారు. బీజేపీపై పొన్నయన్‌ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవేనని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-06-04T13:36:20+05:30 IST