Khamosh: బీజేపీపై షాట్‌గన్ సూటి కామెంట్...

ABN , First Publish Date - 2022-08-11T00:39:11+05:30 IST

''ఖామోష్'' అనే డైలాగ్ వినగానే బాలీవుడ్ 'షాట్‌గన్' శత్రుఘ్నుసిన్హా గుర్తుకు...

Khamosh: బీజేపీపై  షాట్‌గన్ సూటి కామెంట్...

న్యూఢిల్లీ: ''ఖామోష్'' (Khamosh) అనే డైలాగ్ వినగానే బాలీవుడ్ 'షాట్‌గన్' శత్రుఘ్నుసిన్హా (Shatrughan Sinha) గుర్తుకు వస్తారు. తాజాగా బీహార్ పరిణామాలపై ఆయన ''ఖామోష్'' అంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి కామెంట్ చేశారు. నితీష్ ఒక్కడే ఆ పని చేయలేదని, వాళ్లు (బీజేపీ) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా చాలా రాష్ట్రాల్లో చేసిందిదేనని, అందువల్ల నితీష్‌ను ఏమీ అనలేని పరిస్థితి వారికి ఉందని అన్నారు. బీహార్ పరిణామాలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందని అనుకుంటున్నారని ప్రశ్నించినప్పుడు, ప్రజాతీర్పును వంచించారని బీజేపీ చెబుతోందని, మొత్తంగా చూస్తే మాత్రం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని శత్రుఘ్నుసిన్హా జవాబిచ్చారు.


''నిజం చెప్పాలంటే చాలా రాష్ట్రల్లో ప్రభుత్వాలను గద్దెదింపే విషయంలో వాళ్లు (బీజేపీ) ఇదే చేశారు. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది. మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్రలో మనీ పవర్‌తో వాళ్లు చేసిందిదే. ఇప్పుడు వాళ్లకు కూడా నితీష్ నుంచి ఇదే అనుభవం ఎదురైంది'' అని ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సిన్హా అన్నారు. తాము ఒక్కరిమే ఉంటామని బీజేపీ ఇటీవల చెప్పుకుందని, ఇదెలా సాధ్యమని సిన్హా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలు ఉంటాయని, ప్రాంతీయ పార్టీలు ఉంటాయని అన్నారు. ఆ ప్రకారమే బీహార్‌లో ఏడు పార్టీలు, ఒక ఇండిపెండెంట్‌ కలిసి గ్రాండ్ అలయెన్స్‌గా ఏర్పడ్డాయని చెప్పారు. బీజేపీకి ఉద్వాసన చెప్పాలని నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సిన్హా సమర్ధించారు. కేంద్రంలోని అధికార పార్టీ నితీష్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదని, రూ.1,76,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కానీ, బీహార్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కానీ ఇవ్వలేకపోయిందని, నితీష్‌కు కేంద్రం చేసిందేమీ లేదని సిన్హా అన్నారు.

Updated Date - 2022-08-11T00:39:11+05:30 IST