munugodu by-election: మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ హైకమాండ్‌ ఫోకస్

ABN , First Publish Date - 2022-08-04T16:36:39+05:30 IST

మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ హైకమాండ్‌ (BJP High Command) ఫోకస్ పెట్టింది. మునుగోడులో బీజేపీ బలాబలాలపై కేంద్రమంత్రి అమిత్‌షాకు

munugodu by-election: మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ హైకమాండ్‌ ఫోకస్

ఢిల్లీ: మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ హైకమాండ్‌ (BJP High Command) ఫోకస్ పెట్టింది. మునుగోడులో బీజేపీ బలాబలాలపై కేంద్రమంత్రి అమిత్‌షాకు రాష్ట్ర నేతలు నివేదిక ఇచ్చారు. ఉపఎన్నిక కోసం కమలం దళం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఉపఎన్నికకు సంబంధించి త్వరలో కమిటీలను అధిష్టానం నియమించనుంది. ఉపఎన్నికకు ఇంఛార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (Jithender Reddy)ని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు ఇన్‌చార్జిగా జితేందర్‌రెడ్డి వ్యవహరించారు. ఆయనది లక్కీ హ్యాండ్‌ (Lucky Hand) అని పేరుంది. మునుగోడు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అసెంబ్లీలో మరోస్థానం పెంచుకోవడం ద్వారా నాలుగో ‘ఆర్‌’పై కమలం గురిపెట్టింది. కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరడానికి మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉప ఎన్నికలో గెలిచితీరాలని కమలనాథులు కంకణబద్ధులై ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజాసింగ్‌ ఒక్కరే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్‌రావు, హుజురాబాద్‌ నుంచి ఈటల రాజేందర్‌లు విజయం సాధించి, అసెంబ్లీలో పార్టీని ట్రిపుల్‌-ఆర్‌/ఆర్‌ఆర్‌ఆర్‌(రాజాసింగ్‌, రఘునందన్‌, రాజేందర్‌)గా కొనసాగిస్తున్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా నాలుగో ‘ఆర్‌’ను బీజేపీ తరఫున అసెంబ్లీకి పంపాలని కసరత్తు చేస్తున్నారు.


రాజగోపాల్‌రెడ్డి రాజీనామ ప్రకటనతో రానున్న నాలుగు నుంచి ఆరునెలల మధ్య వ్యవధిలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమని తెలుస్తోంది. దీంతో అన్ని పార్టీలు మునుగోడు కేంద్రంగా పనిచేయనున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నేతలు పది రోజులుగా తెరముందు, తెరవెనుక మునుగోడు ఉప ఎన్నికపై దృష్టిపెట్టారు. రాజగోపాల్‌ రాజీనామా కోసం వేచి చూసిన కాంగ్రెస్‌ నేతలు, ఆయన ప్రకటన రావడంతో త్వరలో నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు ప్రారంభించారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంకాగా, కొద్దిరోజుల్లో దీనికి సంబంధించిన కార్యాచరణపై స్పష్టత రానుంది. బీజేపీలో చేరికను భారీగా నిర్వహించనున్నట్టు తెలిసింది. ప్రధాన పార్టీలు బుధవారంనుంచే మునుగోడు ఉపఎన్నికపై కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నాయి. రాజగోపాల్‌రెడ్డి ప్రకటనతో బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, సీపీఐ, వైఎ్‌సఆర్‌టీపీ పార్టీ నేతలు సైతం భవిష్యత్‌ వ్యూహాలను ప్రకటించి మునుగోడులో పర్యటనలకు సన్నాహాలు చేస్తున్నారు.


రాష్ట్రంలో అసెంబ్లీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు, సంస్థాగతంగా మరింత విస్తరించేందుకు కమలం పార్టీ జాతీయ నాయకత్వం ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రపార్టీ నాయకత్వానికి కార్యాచరణ నిర్దేశించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ఒకవైపు కొనసాగించనుండగా, మరోవైపు.. పార్టీ సీనియర్‌ నాయకులు మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా బిజీ షెడ్యూలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా  గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీల కార్యక్రమాన్ని ఎన్నికల వరకూ దశలవారీగా కొనసాగించనున్నారు. వచ్చేనెల 2 నుంచి సంజయ్‌ మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర యాదగిరిగుట్ట నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర వరంగల్‌ వరకూ 20 రోజుల పాటు కొనసాగనుంది. ఈ యాత్ర రూట్‌మ్యాప్‌ పరిధిలోకి రాని నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్‌ నేతలు దశలవారీగా పర్యటించనున్నారు. ఇప్పటివరకు సంజయ్‌ రెండు దశల్లో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. సంజయ్‌ పర్యటన కొనసాగుతున్న నియోజకవర్గాల్లోనే పార్టీ ఎక్కువ ఫోకస్‌ పెడుతుండగా, మిగతా సెగ్మెంట్లలో  రాష్ట్ర పార్టీ ముఖ్యునేతలు కూడా ఏదో ఒక కార్యక్రమం చేపట్టేలా జాతీయ నాయకత్వం కార్యాచరణను నిర్దేశించిందని బీజేపీ వర్గాలు వివరించాయి. 

Updated Date - 2022-08-04T16:36:39+05:30 IST