Bihar political crisis: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ వర్సెస్ నితీశ్!

ABN , First Publish Date - 2022-08-09T22:56:52+05:30 IST

పాట్నా: బీజేపీకి గుడ్‌బై చెప్పి ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ 160 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బీహార్‌లో సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయనున్నారు.

Bihar political crisis: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ వర్సెస్ నితీశ్!

పాట్నా: బీజేపీకి గుడ్‌బై చెప్పి ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ 160 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బీహార్‌లో సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రిగా నితీశ్, డిప్యూటీగా తేజస్వీ కొనసాగాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక ఆయన కొంత కాలమే ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని, అనంతరం పగ్గాలు తేజస్వీకి అప్పగిస్తారని సమాచారం. నితీశ్ ఆలోచనలు 2024పై ఉండటమే దీనికి కారణమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా నితీశ్ బరిలోకి దిగుతారని అప్పుడే ప్రచారం మొదలైంది. 


2024 ఎన్నికలు బీజేపీకి కూడా ముఖ్యమైనవే. హ్యట్రిక్ కొట్టాలని కమలనాథులు కలలు కంటోన్న సమయంలో నితీశ్ ఒక్కసారిగా మద్దతు ఉపసంహరించి ప్రకంపనలు రేపారు. బీహార్ సంకీర్ణ సర్కారులో జేడియూతో పాటు ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ-ఎంఎల్‌ ఉంటున్నాయి. కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు కూడా జత కలవడం నితీశ్‌కు ప్లస్ పాయింట్‌గా మారనుంది. బంధుప్రీతిలేని బీసీ నాయకుడిగా నితీశ్‌కు పేరుంది. ఇది ఆయనకు కలిసొచ్చే అంశం కూడా. మోదీ కూడా బీసీయే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో యుద్ధం ఈ ఇద్దరు బీసీ నేతల మధ్యే ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 


వాస్తవానికి 2024 ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోదగ్గ రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటని బీజేపీ తలచింది. సర్వేలు కూడా ఇదే చెప్పాయి. అయితే ఇంతలోనే నితీశ్ ఎన్డీయేకి కటిఫ్ చెప్పడంతో కమలనాథులు ఆత్మరక్షణలో పడ్డారు. 


నిజానికి 2025 ఎన్నికల్లో నితీశ్ సారధ్యంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడియూకు తమ కన్నా అతి తక్కువ సీట్లు వచ్చినా నితీశ్‌నే సీఎం చేసిన కమలనాథులు నితీశ్ చర్యతో బిత్తరపోయారు. బీజేపీతో దోస్తీకి కటిఫ్ చెప్పడం ద్వారా నితీశ్ బీజేపీ అధినాయకత్వానికి పెద్ద షాకిచ్చారు.


2024కు ఇంకా రెండేళ్ల గడువుంది. ఈలోగా నితీశ్ తమ పార్టీకి ద్రోహం చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతి సంపాదించాలని బీజేపీ యోచిస్తోంది. తక్కువ సీట్లు వచ్చినా నితీశ్‌ను ముఖ్యమంత్రిగా చేశామని, సీనియర్ అని అందలమెక్కించినా వెన్నుపోటు పొడిచారనే అంశాన్ని బీహారీలకు అర్థమయ్యేలా చెప్పాలని కమలనాథులు యోచిస్తున్నారు. తద్వారా నితీశ్‌‌ ప్రభావాన్ని వీలైనంత అడ్డుకోవాలని యోచిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. 

Updated Date - 2022-08-09T22:56:52+05:30 IST