కొత్త ఫార్ములా తెరపైకి తెచ్చి నితీశ్‌కు ముకుతాడు వేయనున్న బీజేపీ!

ABN , First Publish Date - 2020-06-07T17:36:37+05:30 IST

బిహార్ రాజకీయంలో ఏకధాటిగా సాగిపోతున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భాగస్వామి పక్షమైన బీజేపీ ఝలక్ ఇవ్వనుందా? ఎన్నికలు

కొత్త ఫార్ములా తెరపైకి తెచ్చి నితీశ్‌కు ముకుతాడు వేయనున్న బీజేపీ!

పాట్నా : బిహార్ రాజకీయంలో ఏకధాటిగా సాగిపోతున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భాగస్వామి పక్షమైన బీజేపీ ఝలక్ ఇవ్వనుందా? ఎన్నికలు దూసుకొస్తున్న వేళ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చి, ఆయనకు ముకుతాడు వేయాలని కమల దళం సర్వ సన్నద్ధాన్ని చేసుకుంది. ఇన్నాళ్లూ నితీశ్ అభీష్టం ప్రకారమే అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. చివరికి ఎన్నికల సీట్ల సర్దుబాటు కూడా అంతే. దీనిని ఈసారి బీజేపీ హ్యాండిల్ చేయాలని దృఢ నిశ్చయంతో ఉంది.


ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 50-50 శాతం సీట్లలో పోటీ చేయాలన్న సరికొత్త ప్రతిపాదనను ముఖ్యమంత్రి పీఠం ముందు ఉంచనుంది బీజేపీ అధిష్ఠానం. ఇదే ఫార్ములాతో సార్వత్రిక ఎన్నికల గోదాలోకి దిగామని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములాతో సాగాలని బీజేపీ తెగేసి చెప్పనుంది.


‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ సమాన సీట్లలో పోటీలోకి దిగుతాయి. జేడీయూ నుంచి తాము ఆశించేది ఇదే. అయితే చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇదే ఫార్ములాను సార్వత్రిక ఎన్నికల్లోనూ అవలంబించాం’’ అని ఓ నేత పేర్కొన్నారు. ఇక మిగితా చిన్నా చితక ఎల్జేపీ లాంటి భాగస్వామ్య పక్షాలకు వారి వారి తాహతును, కార్యక్షేత్రంలో ప్రభావితం చేసే స్థాయిని బట్టి సీట్ల కేటాయింపు ఉంటుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. తాము బీజేపీతోనే ఉంటామని, బీజేపీకే తమ పూర్తి మద్దతు అని ఎల్జేపీ ఇప్పటికే ప్రకటించింది. 

బీజేపీ డిమాండ్... వయా చిరాగ్ పాశ్వాన్

వచ్చే ఎన్నికల్లో 50-50 సీట్లలో పోటీచేయాలన్న ప్రతిపాదనను బీజేపీ నేరుగా చెప్పకుండా అన్యాపదేశంగా ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్‌తో చెప్పించారా? అందుకే నితీశ్‌పై చిరాగ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారా? అని బిహార్ రాజకీయంలో చర్చలు సాగుతున్నాయి. ఒక్కసారిగా 50-50  డిమాండ్ తెరపైకి తేకుండా చిరాక్ పాశ్వాన్ అసంతృప్తిని ముందుంచి సీఎం నితీశ్‌తో బేరమాడాలని బీజేపీ ప్లాన్ అయివుండవచ్చు.


ఎన్నికల సమయంలో నితీశ్ బీజేపీతో చెడుగుడు ఆడకుండా... ఇప్పటి నుంచే నితీశ్‌ను తగ్గించే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో ఎవరి సారథ్యంలో ఎన్నికలకు వెళ్తున్నారు? నాయకుడు ఎవరు? అని బహిరంగంగానే చిరాగ్ పాశ్వాన్ బీజేపీని ప్రశ్నించారు. అంతేకాకుండా వలస కార్మికుల విషయంలో నితీశ్ ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. నేరుగా బీజేపీయే నితీశ్‌ని తగ్గించకుండా... చిరాగ్ పాశ్వాన్ రూపంలో తగ్గించి... తమ దగ్గరికి తెచ్చుకోవాలని బీజేపీ పాచికలు వేసినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-06-07T17:36:37+05:30 IST