మద్దతు ధరకు ధాన్యం కొనాల్సిందే!

ABN , First Publish Date - 2020-09-16T18:01:16+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ..

మద్దతు ధరకు ధాన్యం కొనాల్సిందే!

కలెక్టరేట్‌ వద్ద బీజేపీ, జనసేన ధర్నా


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ, జనసేన నాయకులు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ధా న్యాన్ని రోడ్డుపై పోసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మిల్లర్లు, దళారుల మోసానికి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ధాన్యం గిట్టుబాటు ధర టన్ను రూ.15,600 ప్రకటించారని, అయితే రైతులు రూ.6వేల నుంచి 8 వేలకే తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రూ.8వేల కు రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి బిల్లింగ్‌, అమ్మకాలు రూ.15వేలు చూపుతున్నారని ఆరోపించారు. ప్రభు త్వం ఆడిట్‌ చేసి రూ.15వేలు రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు కరోనా సాకుతో తప్పించుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు.


రైతులు కొనుగోలు కేంద్రానికి తాళం వేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులకు ఇలానే అన్యా యం జరిగే ప్రతిఘటించే రోజు వస్తుందని హెచ్చరించారు. అనంతరం బీజేపీ, జనసేన నాయకులు కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు భరత్‌కుమార్‌, నాయకులు సురే్‌షరెడ్డి, మిడతల రమేష్‌, జనసేన నాయకులు గునుకుల కిషోర్‌, అజయ్‌, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, శ్రీకాంత్‌, పవన్‌, బోనుబోయిన ప్రసాద్‌, షాజహాన్‌ పాల్గొన్నారు.


స్మార్ట్‌ మీటర్లు ఆపేయాలని..

వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఆపుదల చేయాలని కోరుతూ మంగళవారం అఖిల పక్ష సమన్వయ కమిటీ నాయకులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసే జీవో నెం. 22ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ నాయకులు రామరాజు మాట్లాడుతూ విద్యుత్‌ నగదు బదిలీ పథకాన్ని నిలుపుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణను శాసన సభలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాం డ్‌ చేశారు. ఈ ఆందోళనలో నాయకులు గంగపట్నం రమణయ్య,  ఎస్‌కే ఘనీ, కే.చిన్న అంకయ్య,  వై.ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


నెరవేరని డీఎం హామీ.. మళ్లీ రోడ్డెక్కిన అన్నదాత

సంగం: మద్దతు ధర కోసం అన్నదాత మళ్లీ రోడ్డెక్కాడు. ఈ నెల 9వ తేదీన రైతులు ఆందోళన చేయడం తో పౌర సరఫరాలశాఖ డీఎం రోజ్‌మాండ్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి రోజుకు పదిహేను లారీల ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు అది నెరవేరకపోవడంతో ధా న్యం కల్లాల్లోనే పట్టలు కప్పి పెట్టిన రైతులు ఆగ్రహంతో మంగళవారం తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని సంగం-ముంబయి జాతీయ రహదారిపై పోసి రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తహసీల్దారు నిర్మలానంద బాబా వచ్చి డీఎంతో ఫోన్‌లో మాట్లాడించేందుకు ప్రయత్నించినా రైతులు ససేమిరా అన్నారు. డీఎం హామీ వద్దు.. సాయంత్రంలోపు కల్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు.


ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎస్పీ సమావేశంలో ఉన్న ఎస్‌ఐ ఫోన్‌ చేసి ఆందోళన విరమించకుంటే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో మరింత రెచ్చిపోయిన రైతులు ధాన్యం కొనమంటే కేసులు  కడతామని బెదిరించడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో డీఎస్వో కార్యాలయ ఎస్‌వో   రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొంటామని చెప్పినా, హామీలు వద్దు ధాన్యం కొనండని రైతులు డిమాండ్‌ చేశారు. చివరకు ప్రయాణంలో ఉన్న ప్రజల అసౌకర్యాన్ని గుర్తించి తహసీల్దారు హామీ రైతులు ఆందోళన విరమించారు. 


బుచ్చిరెడ్డిపాళెం : సాల్మానుపురం వద్ద వున్న సోమిశెట్టి రైస్‌మిల్లు వద్ద మంగళవారం పంచేడు గ్రామానికి చెందిన రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు మిల్లు సిబ్బందితో వాగ్వాదం జరిగింది. రెవెన్యూ, వ్యవసాయశాఖ అఽధికారులు మిల్లుకు చేరుకుని మిల్లరు, రైతులతో చర్చించారు. మిల్లరు నరసింహ రావు ఆ రైతులకు చెందిన సుమారు 100 పుట్ల ధాన్యం తీసుకునేందుకు ఒప్పుకున్నారు. 

Updated Date - 2020-09-16T18:01:16+05:30 IST