Mamata Banerjee: కోల్‌కతాలో బొగ్గు దోచుకుంటున్న బీజేపీ నేతల మాటేమిటి?

ABN , First Publish Date - 2021-08-28T21:21:53+05:30 IST

తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్యకు ఈడీ సమన్లు జారీ చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

Mamata Banerjee: కోల్‌కతాలో బొగ్గు దోచుకుంటున్న బీజేపీ నేతల మాటేమిటి?

కోల్‌కతా : తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్యకు ఈడీ సమన్లు జారీ చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపైకి ఉసిగొల్పుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి దమ్ముంటే రాజకీయంగా తమను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అంతేగానీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం పద్ధతి కాదని చురకలంటించారు. ‘‘తమను రాజకీయంగా ఎదుర్కోవాలని బీజేపీకి సవాల్ విసురుతున్నా. అంతేగానీ ఈడీని ఎందుకు ఉసిగొల్పుతున్నారు? దీనిపై ఎలా పోరాడాలో మాకు బాగా తెలుసు. గుజరాత్ చరిత్ర కూడా మాకు తెలుసు’’ అంటూ మమత విరుచుకుపడ్డారు. బొగ్గు అవినీతిలో తమ వైపు వేలెత్తిచూపితే ప్రయోజనం శూన్యమని అన్నారు. బొగ్గు వ్యవహారం కేంద్రం చేతిలో ఉంటుందని, బెంగాల్, అసోల్ ప్రాంతాల్లో బొగ్గు అవినీతికి పాల్పడుతున్న బీజేపీ నేతల మాటేమిటని సూటిగా ప్రశ్నించారు. 


మరోవైపు తృణమూల్ విద్యార్థి విభాగం ఆవిర్భావాన్ని పురస్కరించుకొని మమత కాళీఘాట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజల కోసం పోరాడడమే తమ ప్రప్రథమ ప్రాధాన్యమని అన్నారు. నిరుపేదలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతోనే విద్యార్థులు ముందుకు కదులుతారన్నది తమ విశ్వాసమని ఆమె అన్నారు. విద్యార్థులే భవిష్యత్ విధాతలని, రాజకీయాలను కొత్త పుంతలు తొక్కించాలని చూస్తున్నట్లు తెలిపారు. కొందరు ఎన్నికల సమయంలో పార్టీని విడిచి వెళ్లారని, కానీ, పార్టీ ప్రాధాన్యాన్ని తెలుసుకొని, తిరిగి సొంత గూటికి వచ్చేస్తున్నారని మమత అన్నారు. 

Updated Date - 2021-08-28T21:21:53+05:30 IST