బీజేపీ దూకుడు

ABN , First Publish Date - 2022-05-01T05:37:53+05:30 IST

రాష్ట్ర సీఎం పీఠంపై కన్నేసిన కమలనాథులు తమ స్పీడును పెంచారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన బలాన్ని పెంచుకునే క్రమంలో భాగంగా బీజేపీ నగర శివారు ప్రాంతాలను ఎన్నుకుంది.

బీజేపీ దూకుడు

  • నగర శివార్లపై కన్ను
  • అధికారం పొందేందుకు ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్న కమలనాథులు
  • శివార్లలో పార్టీ కార్యక్రమాల రూపకల్పన
  • తరచూ రాష్ట్ర, జాతీయ నేతలతో సమావేశాలు
  • బీజేపీ కనుసన్నల్లోనే శంషాబాద్‌లో గడ్కరీ కార్యక్రమం
  • కేంద్ర పథకాల అమలులో ‘కమలం’ మార్క్‌ ఉండేలా జాగ్రత్తలు
  • తుక్కుగూడలో జరిగే అమిత్‌షా సభకు భారీ ఏర్పాట్లు

రాష్ట్ర సీఎం పీఠంపై కన్నేసిన కమలనాథులు తమ స్పీడును పెంచారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన బలాన్ని పెంచుకునే క్రమంలో భాగంగా బీజేపీ నగర శివారు ప్రాంతాలను ఎన్నుకుంది. కేంద్రం నిధులతో జరిగే అభివృద్ధి పనుల్లో పూర్తిగా తమకు కలిసివచ్చేలా చర్యలు చేపట్టింది.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, ఏప్రిల్‌ 30) : వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్న భారతీయ జనతాపార్టీ రాజకీయంగా దూకుడు పెంచుతోంది. ముఖ్యంగా కీలకమైన నగర శివార్లలో పాగా వేసేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. మహేశ్వరం, రాజేంద్రనగర్‌,  శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌, కల్వకుర్తి నియోజకవర్గాలపై బీజేపీ నాయకత్వం ఎక్కువగా ఫోకస్‌ చేసింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో శివారు ప్రాంతాలకు చాపకింద నీరులా పార్టీని విస్తరిస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. రాజకీయంగా తమకు లాభించే ప్రతి అంశాన్నీ వాడుకుంటోంది. అధికార టీఆర్‌ఎ్‌సకు తామే అసలు పోటీదారులమనే రీతిలో నగర శివార్లలో ముమ్మర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజలకు దగ్గరయ్యేందుకు నిత్యం నగర శివార్లలో ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రనేతలతో పాటు జాతీయ నేతలతో సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. అధికారిక కార్యక్రమాలను సైతం పార్టీకి ప్రయోజనకరం కలిగించే రీతిలో నిర్వహిస్తోంది. శుక్రవారం శంషాబాద్‌లో నిర్వహించిన జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమమే ఇందుకు ఉదాహరణ. హైదరాబాద్‌ నగర శివార్లతో పాటు రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల విస్తరణ కోసం రూ. వేల కోట్లతో  చేపడుతున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముగ్గురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ కేంద్ర సహాయ మంత్రి వీకేసింగ్‌, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం ముద్రలేకుండా బీజేపీ జాగ్త్రత్తలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఇంత భారీ కార్యక్రమాన్ని బీజేపీ నేతలు తమ సొంత కార్యక్రమంగా నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల హడావిడి కనిపిస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ నేతల కనుసన్నల్లోనే ఆద్యంతం ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున బీజేపీ శ్రేణులను తరలించారు. రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం వీరందరికీ పాస్‌లు ఏర్పాటు చేసింది. మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ నేతలకు ఈ కార్యక్రమంలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి సభలో తీవ్ర పరాభవం ఎదురైంది. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా జై శ్రీరాం.. జైజై శ్రీరాం.. భారత్‌ మాతాకీ జై.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అవంతరాలు కల్పించారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొనడంతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.  తర్వాత మంత్రి ప్రశాంత్‌రెడ్డి తన ప్రసంగాన్ని యధావిధిగా కొనసాగించారు. తీవ్ర నిరుత్సాహానికి గురైన మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాన్ని బీజేపీ తన కార్యక్రమంగా మార్చుకుందని అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ముచ్చింతల్‌లో అంగరంగ వైభవంగా  జరిగిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకులు సైతం బీజేపీ కనుసన్నల్లోనే నిర్వహించడం గమనార్హం. మొదట నుంచి ఇక్కడ రామానుజ విగ్రహావిష్కరణకు సహకరించిన సీఎం కేసీఆర్‌ విషయంలో ప్రొటోకాల్‌ పాటించకపోవడంతో చివరకు ఆయన ముగింపు వేడుకులకు సైతం దూరంగా ఉన్న విషయం తెలిసిందే.


  • అమిత్‌షా సభకు భారీ ఏర్పాట్లు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర మే 14వ తేదీన నగర శివార్లలోని మహేశ్వరం మండలం తుక్కుగూడలో ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా  విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా 14వ తేదీ సాయంత్రం తుక్కుగూడలో నిర్వహించే  బహిరంగ సభకు భారీగా జనాన్ని తరలించేందుకు బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు దాదాపు లక్షన్నర మందిని సమీకరించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా జిల్లాలో తనసత్తా చూపాలని బీజేపీ భావిస్తోంది. 


  • టీఆర్‌ఎ్‌సకు లబ్ధి జరగకుండా...

కేంద్రం నిధుల ద్వారా అమలయ్యే పథకాలు, కార్యక్రమాలపై బీజేపీ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. కేంద్ర నిధులతో చేపట్టే కార్యక్రమాల వల్ల ఇక్కడ అఽధికార టీఆర్‌ఎ్‌సకు మేలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్‌- బీజాపూర్‌ హైవే విస్తరణ పనుల ఘనత తమదేనని ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం చెబుతూ వచ్చింది. ఆ పార్టీ ఎంపీ రంజిత్‌రెడ్డి అనేకసార్లు దీనిపై ప్రకటనలు చేశారు. కేంద్రమంత్రి గడ్కరీని గతంలో కలిసిన ప్రతిసారీ ఆయన పత్రికా ప్రకటనలు ఇచ్చేవారు. అయితే ఇపుడు సీన్‌ రివర్స్‌ అయింది. ఇదంతా తమ ఖ్యాతేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డిని కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌కు గానీ మాట్లాడే అవకాశం కల్పించలేదు. త్వరలో రీజినల్‌ రింగురోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని కేంద్రమంత్రి గడ్కరీ వెల్లడించారు. హైదరాబాద్‌కు తలమానికంగా నిర్మించనున్న రీజినల్‌ రింగురోడ్డు ఘనత తమదేనన్నట్లుగా బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టారు.

Updated Date - 2022-05-01T05:37:53+05:30 IST