మహేశ్వరంపై కాషాయం కన్ను!

ABN , First Publish Date - 2022-05-04T16:48:10+05:30 IST

మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా తన పట్టు పెంచుకుంటోంది. ఒకప్పుడు ‘ఇక్కడ బీజేపీకి అంత సీన్‌ లేదు’

మహేశ్వరంపై కాషాయం కన్ను!

 అధినాయకత్వం సహకారంతో ముందడుగు వేస్తున్న అందెల 

 వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న పార్టీ శ్రేణులు


హైదరాబాద్/సరూర్‌నగర్‌: మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా తన పట్టు పెంచుకుంటోంది. ఒకప్పుడు ‘ఇక్కడ బీజేపీకి అంత సీన్‌ లేదు’ అన్న రాజకీయ పరిశీలకులు సైతం ఇప్పుడు.. ‘సీన్‌ బీజేపీదే’ అనే స్థాయికి పార్టీ చేరింది. గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చి పార్టీ టికెట్‌ దక్కించుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసిన అందెల శ్రీరాములుయాదవ్‌ క్రమక్రమంగా తన బలం పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు గట్టి సవాల్‌ విసిరి దాదాపు 40వేలకు పైగా ఓట్లు సాధించి ఔరా అనిపించారు. పార్టీ అధినాయకత్వంలోని పలువురు నాయకుల సహకారంతో స్థానిక నాయకులు, కింది స్థాయి కార్యకర్తలనుసమన్వయం చేసుకుని పార్టీకి గట్టి పునాది వేశారు శ్రీరాములుయాదవ్‌.

 

స్థానిక ఎన్నికలతో పెరిగిన బలం

అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలోని మెజారిటీ స్థానాలను దక్కించుకోవడంలో అందెల శ్రీరాములుయాదవ్‌ సక్సెస్‌ అయ్యారు. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో ఏకంగా పది డివిజన్లను, మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో 16 డివిజన్లను దక్కించుకుని అధికార టీఆర్‌ఎ్‌సను కంగు తినిపించారు. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ తో కలిసి అధికారం పంచుకోవాలని భావించినప్పటికీ.. అనం తర రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి టీఆర్‌ఎ్‌సలో చేరి మేయర్‌ సీటు దక్కించుకోవడంతో బీజేపీకి ఆ అవకాశం చేజారింది. ఇక తుక్కుగూడలోనూ బీజేపీ మెజారిటీ స్థానాలు సొంతం చేసుకోగా, అధికార పార్టీ ఎక్స్‌ అఫిషియో ఓట్లతో అధికారం చేజిక్కించుకుంది. తాజాగా అక్కడి టీఆర్‌ఎస్‌ మునిసిపల్‌ చైర్మన్‌ను తిరిగి బీజేపీలోకి తీసుకురావడంలో అందెల శ్రీరాములుయాదవ్‌ సఫలీకృతులయ్యారు. 


జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌

ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లలోనూ(సరూర్‌నగర్‌, ఆర్‌కేపురం) బీజేపీ విజయం సాధించడంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. అందెల నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేసి రెండు డివిజన్లను క్లీన్‌ స్వీప్‌ చేశారు. 


సామాజిక సేవలోనూ

 అందెల శ్రీరాములుయాదవ్‌ ఓ వైపు రాజకీయంగా పార్టీని బలోపేతం చేస్తూనే.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు, దివ్యాంగులకు, అనాథాశ్రమాలకు, లైబ్రరీకి, ఇతరత్రా సంస్థలకు తన వంతు సహాయం చేస్తూ ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. కరోనా విపత్కర సమయంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఒకే రోజు 30వేల నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయించారు. 

 రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, మహేశ్వరంలో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని అందెల ధీమాగా చెబుతున్నారు. 

Read more