దక్కన్ దండయాత్రలో బీజేపీ

ABN , First Publish Date - 2022-07-06T06:18:59+05:30 IST

కర్ణాటక తర్వాత మరో దక్షిణాది రాష్ట్రంలో ప్రవేశించేందుకు చాలాకాలంగా బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు రకరకాల కారణాల వల్ల సఫలీకృతం కాలేదు...

దక్కన్ దండయాత్రలో బీజేపీ

కర్ణాటక తర్వాత మరో దక్షిణాది రాష్ట్రంలో ప్రవేశించేందుకు చాలాకాలంగా బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు రకరకాల కారణాల వల్ల సఫలీకృతం కాలేదు. తాజాగా తెలంగాణలో చోటుచేసుకొంటున్న పరిణామాలు బిజెపిలో మరోసారి ఆశలు చిగురించేందుకు కారణమవుతున్నాయి. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం వరకూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందా అన్న ప్రశ్న ఎవరైనా వేస్తే ఆ ప్రశ్న వేసిన వారిని ఎగాదిగా చూసేవారు. తెలంగాణ సామాజిక రాజకీయ వాతావరణం బిజెపికి అనుకూలంగా లేదని, అక్కడ హిందూత్వ శక్తులకు ప్రజలు ఓటు వేసే అవకాశమే లేదని చెప్పేవారే అధికంగా ఉండేవారు. నిజంగా నిన్నమొన్నటి వరకూ తెలంగాణలో బిజెపి అస్తిత్వం కోసం సంఘర్షిస్తూ ఉండేది. కొందరు స్థానిక నేతలు అత్యంత ఉత్సాహంగా పనిచేసినా జాతీయ స్థాయిలో వారికి అంత గుర్తింపు ఉండేది కాదు. అందుకు కారణం ఢిల్లీ బిజెపి పెద్దలకు తెలంగాణ ఒక ప్రాధాన్యత గల రాష్ట్రం కాకపోవడమే.


రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు వెళ్లినప్పుడు తెలంగాణలో బిజెపి ఒక చర్చనీయాంశమైన స్థాయికి ఎదిగిందని, సామాన్యులు కూడా బిజెపి గురించి చర్చించుకుంటున్నారని అర్థమైంది. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల నుంచి రోజు కూలికి వెళ్లేవారు సైతం బిజెపి గురించి మాట్లాడుతున్నారు. కెసిఆర్ పాలనలో మంచి చెడులను, కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలను బేరీజు వేస్తున్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తెలంగాణ వాతావరణంలో కూడా మార్పు వచ్చిందనడంలో సందేహం లేదు. కేంద్రం వైఖరితో నిమిత్తం లేకుండా తెలంగాణలో బిజెపిని బలోపేతం చేయాలని అమిత్ షా పార్టీ నేతల వెంటపడడం ప్రారంభించారు. ఎవరు అవునన్నా, కాదన్నా బండి సంజయ్‌ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన తర్వాత ఆ పార్టీకి సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో ఒక కదలిక ఏర్పడింది. రాజ్యాధికారంలో తమకు అవకాశం లేదని గ్రహించిన అనేకమంది బిజెపికి అనుకూలంగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ మార్పు ఎన్నికల పరంగా బిజెపికి కొన్ని సానుకూల ఫలితాలను కూడా తెచ్చిపెట్టింది. ఇతర పార్టీల నుంచి ముఖ్యనేతలు వలస వచ్చేందుకు కారణమైంది. మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలు చాలా ముందుగానే బిజెపి పుంజుకునే అవకాశాలను గ్రహించారు. అయితే హవా ఒక్కటే బిజెపికి నిర్మాణపరంగా పటిష్ఠమయ్యేందుకు, ఎన్నికల బరిలో బలంగా నిలిచేందుకు సరిపోదని గ్రహించిన సమయంలోనే బిజెపి అధిష్టానం హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది.


తెలంగాణకు బిజెపి పూర్తిగా కొత్త పార్టీ కాదు. తెలంగాణ సామాజిక, రాజకీయ వాతావరణంలో అంతర్లీనంగా చాలా కాలం నుంచీ బిజెపి భావజాలం ప్రవహిస్తూ ఉన్నది. జనసంఘ్ బలంగా ఉన్న రోజుల్లో దీపం గుర్తుతో ఎంతో మంది నేతలు బలంగా పోరాడిన రోజులున్నాయి. వరంగల్ జిల్లాలో ధర్మారావు, శ్రీరాములు, జైపాల్, జంగారెడ్డి, రాజేశ్వరరావు తదితర నేతలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. జైపాల్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే, జంగారెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. మునిసిపల్, పంచాయతీ బోర్డుల్లో జనసంఘ్ అభ్యర్థులు గెలిచిన సందర్భాలున్నాయి. హైదరాబాద్ కేంద్ర ప్రాంత ప్రచారక్‌గా ఉన్న సోంపల్లి సోమయ్య, సోమయాజులు ఎందరో నేతల్ని గుర్తించారు. వారందరూ తర్వాతి కాలంలో బిజెపిలో కీలక పాత్ర పోషించారు. ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, బంగారు లక్ష్మణ్, ఆలె నరేంద్ర, మందాడి సత్యనారాయణ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు జనసంఘ్‌లోనూ, బిజెపిలోనూ నిర్వహించిన పాత్ర తక్కువేమీ కాదు. ప్రతి జిల్లాలోనూ ఆర్ఎస్ఎస్ కుటుంబాలు ఉన్నాయి. తెలంగాణలోని అనేక విద్యాసంస్థల్లో ఏబీవీపీ క్రియాశీలక పాత్ర పోషించింది. కరీంనగర్‌లో మెట్‌పల్లి, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి ప్రాంతాల్లోను, పాలమూరులో మఖ్తల్, నారాయణ్‌పేట, కల్వకుర్తి ప్రాంతాల్లోను, వరంగల్‌లో వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, హనుమకొండ ప్రాంతాల్లో బిజెపి ఎంతో కొంత ప్రభావం చూపింది. నిజామాబాద్, కరీంనగర్‌లో టీఆర్ఎస్ ఓటమి యాదృచ్ఛికం కాదని వివిధ సెగ్మెంట్లలో ఓటుశాతం బట్టి అర్థమవుతుంది. ఏమైనా జనసంఘ్, బిజెపి ఒక సుదీర్ఘ ప్రయాణ క్రమంలో అనేక చారిత్రక తప్పిదాలు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో ఆ పార్టీల పురోగతికి అడ్డుపడ్డాయి. ఉదాహరణకు 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు జనసంఘ్ సానుకూల వైఖరి తీసుకోలేదు. 1972లో ఆంధ్రా ఉద్యమాన్ని సమర్థించింది, 1975లో ఎమర్జెన్సీ తర్వాత తెలంగాణలో జనసంఘ్ పుంజుకునేదేమో కాని, ఎన్టీఆర్ ప్రభంజనం తర్వాత పరిస్థితి మారిపోయింది. తర్వాత కూడా 1991, 1994, 1996, 1998 ఎన్నికల్లో బిజెపి స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు తన ప్రభావాన్ని కనపరిచింది. మళ్లీ ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల బిజెపి నీరసించింది, రాష్ట్ర విభజన తర్వాత ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు పట్టం గట్టినప్పటికీ క్రమక్రమంగా తెలంగాణలో బిజెపి పుంజుకునేందుకు తగిన వాతావరణం ఏర్పడింది.


స్వభావ రీత్యా కూడా బిజెపి తీరుతెన్నుల్లో మార్పు వస్తోంది. ఒకప్పుడు భూస్వామ్య కుటుంబాలు, అగ్రవర్ణాలు అభిమానించిన బిజెపి పట్ల ఇప్పుడు విభిన్న వర్గాలు ముఖ్యంగా దళితులు, వెనుకబడిన కులాల వారు ఆకర్షితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమానుష పీడనకు గురైన నిమ్నవర్గాలు ఇప్పుడు బిజెపి వైపు చూడడం తెలంగాణలో ప్రత్యామ్నాయ, వామపక్ష భావజాలం బలహీనం అయిందని చెప్పేందుకు కూడా నిదర్శనం.


రాజకీయంగా బిజెపి తెలంగాణలో విజయం సాధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కనీసం ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధిగమిస్తుందా అన్నది ఇప్పుడే చెప్పడానికి వీలు లేదు. ఒక రాష్ట్రంలో ప్రభావం చూపాలనుకుంటే బీజేపీ జాతీయ నాయకత్వం చేసే వ్యూహరచన భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం బిజెపి నేతలు పర్యటించడం ప్రారంభించారు. ఎవరెవర్ని ఏ ప్రాంతాలకు పంపాలో పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించారు. ఉదాహరణకు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆ రాష్ట్రానికి చెందిన వారిని పంపారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై అధికంగా దృష్టి సారించారు. నిన్నమొన్నటి వరకూ బండి సంజయ్ చుట్టూ బిజెపి కేంద్రీకృతం కాగా ఇప్పుడు ఇతర పార్టీలనుంచి వచ్చిన డికె అరుణ, ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. కేంద్ర నేతల పర్యవేక్షణలో నిరంతర కార్యాచరణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత జరిగిన మార్పులివి. భవిష్యత్‌లో మరిన్ని మార్పులు, ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఏమైనా తెలంగాణలో విస్తరించేందుకు బిజెపి కేంద్ర నాయకత్వం చతుర్విధోపాయాలు అవలంబిస్తుందనడంలో సందేహం లేదు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే పతనం తర్వాత బిజెపి ఏ రాష్ట్రంలో ఎటునుంచి నరుక్కు వస్తుందో చెప్పలేము.


దేశంలో మారే సామాజిక, రాజకీయ పరిస్థితులపై కూడా తెలంగాణలో బిజెపి ప్రభావం ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఇప్పటికి రెండుసార్లు సార్వత్రక ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. మూడోసారి విజయం సాధించేందుకు ఉరకలు వేస్తోంది. బిజెపికి 40 సంవత్సరాలు తిరుగులేదని హోంమంత్రి అమిత్ షా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అంచనా వేశారు. ప్రతిపక్ష పార్టీలు రోజురోజుకూ ఎందుకు క్రుంగిపోతున్నాయో, ప్రజలు వాటిని ఎందుకు ఆదరించడం లేదో తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు పూర్తిగా మోదీ కేంద్రీకృతంగా జరిగాయి. రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై చర్చలో భాగంగా దేశంలోని రాజకీయ ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించేందుకు బదులు మోదీ తీసుకున్న నిర్ణయాలను శ్లాఘించడంపైనే ప్రతి ఒక్కరూ దృష్టి కేంద్రీకరించారు. అసంఖ్యాక భారతీయులు ఎదుర్కొంటున్న తీవ్ర నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రంగ సంస్థల నగదీకరణ, పెరుగుతున్న ధరలు, అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు చేసిన చట్టాలు, అవలంభించిన విధానాలపై వస్తున్న విమర్శలు, మత ఛాందసవాదం, దెబ్బతింటున్న సామాజిక సామరస్యం, చైనా దురాక్రమణ, ఉక్రెయిన్ నేపథ్యంలో భారత విదేశాంగ నీతి గురించి బిజెపి నేతలు పార్టీ ఆంతరంగిక సమావేశాల్లోనైనా విశ్లేషిస్తూ చర్చించే ప్రయత్నం చేయలేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటలు, 365 రోజులు దేశంలో ఎక్కడ విస్తరించాలా, ఎలా విస్తరించాలా, ప్రతిపక్షాలను ఎలా దెబ్బతీయాలా అన్న తపనే తప్ప ఇతర అంశాలకు అంత ప్రాధాన్యం లేకుండా పోయింది. అయితే ప్రజలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మొదలైన అంశాలపై ఎన్నడూ చర్చించరని, నిత్యం వ్యక్తి కేంద్రీకృత ప్రచారార్భాటంలో కొట్టుకుపోతారని భావించడానికి వీలు లేదు. వ్యక్తి కేంద్రీకృత రాజకీయాలు ఎల్లకాలం ఫలించవు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-07-06T06:18:59+05:30 IST