‘కాంగ్రెస్సీకరణ’లో బీజేపీ!

ABN , First Publish Date - 2020-07-31T07:26:16+05:30 IST

భారత రాజకీయాల్లో, ముఖ్యంగా మోదీ యుగంలో మంచీ మన్ననకు తావు లేకుండా పోతోంది. ఇదొక ప్రత్యక్ష సత్యం. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఇందుకొక తాజా దృష్టాంతాన్ని సమకూరుస్తున్నారు...

‘కాంగ్రెస్సీకరణ’లో బీజేపీ!

విలువల ఆధారిత, భిన్నమైన పార్టీ తమదని సగర్వంగా చెప్పుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రేరేపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ స్థాయి నుంచి అధికార పక్ష స్థాయికి పురోగమించడంలో బీజేపీ తాను శిరసావహించిన ఆదర్శాలకు తిలోదకాలు ఇచ్చింది. ఆ ఆదర్శాల స్ఫూర్తి ఇంకా ఏమైనా మిగిలి వుంటే ఇప్పుడు సంపూర్ణ అధికార సాధన ఆరాటంలో అణగారిపోతోంది. పార్లమెంటు, శాసనసభలు, చివరకు మునిసిపల్ కార్పొరేషన్లలో సైతం అంతకంతకూ పెరుగుతున్న బీజేపీ విజయాలు వాస్తవంగా మాజీ కాంగ్రెస్ నాయకులను తన పక్షంలోకి తీసుకోవడమే కాదూ?


భారత రాజకీయాల్లో, ముఖ్యంగా మోదీ యుగంలో మంచీ మన్ననకు తావు లేకుండా పోతోంది. ఇదొక ప్రత్యక్ష సత్యం. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఇందుకొక తాజా దృష్టాంతాన్ని సమకూరుస్తున్నారు. 1998లో ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని గవర్నర్ రోమేష్ భండారీ బర్తరఫ్ చేశారు. గవర్నర్ చర్యకు నిరసనగా ధర్నా చేసిన బీజేపీ నాయకుల బృందంలో మిశ్రా ఒకరు. ఇప్పుడు జైపూర్ రాజ్ భవన్ ప్రాంగణంలో మిశ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శాసనసభ్యులు బైఠాయింపు ధర్నా చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ డిమాండ్ చేసిన విధంగా రాష్ట్ర శాసనసభ సమావేశాలకు అనుమతినిచ్చేందుకు మిశ్రా తిరస్కరించడమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బైఠాయింపు ధర్నాకు పురిగొల్పింది. గవర్నర్ అంతిమంగా గెహ్లోత్ అభ్యర్థనకు అంగీకరించారు. అయితే అసెంబ్లీని సమావేశపరిచేందుకు విధిగా 21 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అధికార పక్ష శాసన సభ్యుల మద్దతును (ప్రలోభాలతో) సాధించుకునేందుకు ప్రతిపక్షానికి ఈ వ్యవధి సరిపోదూ? ఇక చెప్పేదేముంది? మరి కొద్ది రోజుల్లో మరో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవచ్చు... కూలిపోకపోతేనే మనం ఆశ్చర్యపడాలి సుమా! గవర్నర్ మిశ్రా ప్రాథమిక విధేయత కేంద్రంలోని ప్రభుత్వానికే గానీ, రాజ్యాంగానికి కాదనేది స్పష్టాతి స్పష్టం. 


రాజ్యాంగ నైతికత లోపించిన ఇటువంటి వ్యవహారానికి ఇటీవలి కాలంలో పాల్పడిన గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఒక్కరే కాదు. ఇంకా పలువురు వున్నారు. 2017లో గోవాలో మృదులా సిన్హా, మణిపూర్‌లో నజ్మా హెప్తుల్లాలు బీజేపీ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వాల చేత ఆగమేఘాల మీద పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ రెండు రాష్ట్రాల శాసనసభల్లో బీజేపీ కనీసం ఏకైక పెద్ద పార్టీ కూడా కాదు! 2018లో కర్ణాటక గవర్నర్ వజూభాయి వాలా (గుజరాత్ బీజేపీ మాజీ అధ్యక్షుడు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంఖ్యాబలం ఏమాత్రం లేని బిఎస్ యెడ్యూరప్పను ఆహ్వానించారు. సుప్రీం కోర్టు జోక్యంతో యెడ్యూరప్ప సర్కార్ రెండు రోజులలోనే నిష్క్రమించింది. 2019లో మహారాష్ట్ర గవర్నర్ బి.ఎస్‌.కొషియారీ ఒక ప్రాతః కాలంలో దేవేంద్ర ఫడ్నవీస్ చేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయించారు. వారం రోజుల్లోనే దేవేంద్ర రాజీనామా చేశారు. ఈ ‘గౌరవనీయ’ (అవునా?) గవర్నర్లందరికీ వర్తించే అంశమేమిటి? అందరూ 75 ఏళ్ళ పైబడిన వయో వృద్ధులే. మరీ ముఖ్యంగా బీజేపీ ‘మార్గదర్శక్’ మండల్ రాజకీయ దురంధరులు. రాజ్ భవన్ వారికి ఒక విలాసవంతమైన విశ్రాంత గృహమే. 


ప్రజా జీవితంలో, రాజకీయ వ్యవహారాల్లో అనుభవజ్ఞులైన ఈ రాజ్యాంగాధికారులు ఇలా వ్యవహరించడం సామాన్య పౌరులకు అనుచితంగా కన్పిస్తున్నదనడంలో సందేహం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన సంప్రదాయాలనే తాము అనుసరించామని వారు ముక్తకంఠంతో చెప్పుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ సువ్యవస్థితం చేసిన సంప్రదాయం గవర్నర్ అధికారాలను దుర్వినియోగపరచడమే కాదూ? ఇది ఒక విధంగా భారతీయ జనతా పార్టీ ‘కాంగ్రెస్సీకరణ’కు మరో తిరుగులేని రుజువు. భిన్నమైన పార్టీనని తనకుతాను సగర్వంగా ప్రకటించుకున్న పార్టీ సంపూర్ణ అధికారం కోసం అర్రులు చాస్తున్న పార్టీగా మారిపోయింది! భిన్నమైన పార్టీ అనే ఉద్ఘోషకు అర్థం కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని మాత్రమే కాక ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని కూడా సమకూర్చడమని బీజేపీ నాయకులు గర్వంగా చెప్పేవారు. ‘విలువల ఆధారిత’ రాజకీయాలకు తాము ప్రతినిధులమని వాజపేయి- ఆడ్వాణీ యుగ బీజేపీ రాజకీయ వేత్తలు చాటుకునేవారు. ఇప్పుడు వారి స్థానంలో ఉన్నవారూ ‘విలువ’కు ప్రాధా న్యమిస్తున్నారు. కాకపోతే ఆ ‘విలువ’కు భారీ ధర పలుకుతున్నారు. ధన బలం లేకుండా రాజకీయ కుతంత్రాలు ఎలా జరుగుతాయి?


ఈ వ్యవహారాన్ని ఉదాహరణపూర్వకంగా చూద్దాం. ఒక ఎరువుల కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి గెహ్లోత్ సోదరుడికి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఆ కేసు 2007 నాటిది. బీజేపీకి సన్నిహిత మిత్రుడుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఇటీవల కాలంలో ఇడికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, బెదిరించడానికి ఇడిని ఎంతగా ఉపయోగించుకోవాలో అంతగా ఉపయోగించుకుంటున్నారు. రాజస్థాన్ రాజకీయ కల్లోలంలో ఒక పాత కేసును పునరుద్ధరించడం యాదృచ్ఛికమేమీ కాదు. ప్రత్యర్థులను భయపెట్టి, లొంగదీసుకునేందుకే ఆ కేసును తిరగదోడడం జరిగిందని స్పష్టం. ఇక్కడ సైతం బీజేపీ నాయకులు తమ చర్యలను చాలా తెలివిగా సమర్థించుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవడంలో గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ‘ఘన చరిత్ర’ను తమ ప్రతివాదనలకు వారు ఆధారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సిబిఐ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తే ఇప్పుడు బీజేపీ పాలనలో ఇడి ఒక బలిష్ఠమైన, ప్రమాదకరమైన శునకంలా పరిణమించలేదా? భిన్నమైన పార్టీనని చెప్పుకునే బీజేపీ విలువల నిబద్ధత ఏమయింది? 


రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి ప్రత్యర్థి వైపు మొగ్గేందుకు అధికార పార్టీ కాంగ్రెస్ శాసనసభ్యులకు భారీ సొమ్ము చెల్లించడం జరిగిందని వెల్లువెత్తిన ఆరోపణలనూ పరిశీలించండి. ప్రజల పిచ్చాపాటీలో ప్రస్తావితమవుతున్న విధంగా ఆ సొమ్ము అంత భారీ మొత్తంలో ఉండకపోవచ్చునేమోగానీ పదవీ లాలస వారిని ఫిరాయింపులకు పాల్పడేటట్లు చేసివుంటుందనడంలో సందేహం లేదు. గోవా, మణిపూర్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో అలా ప్రలోభపడి విధేయతను విక్రయించుకున్న వారందరూ చాలా వరకు సముచితంగా లబ్ధి పొందారు. కాంగ్రెస్ నాయకులు ధన బలానికి దాసోహమవ్వడమే ఆ పార్టీ పతనానికి దారితీసిందని ప్రజలు భావించారు. కాంగ్రెస్ నేతలతో సరిపోల్చినప్పుడు బీజేపీ నాయకుల నిరాడంబర జీవన శైలి సహజంగానే ప్రజలను ఆకట్టుకున్నది. తత్ఫలితంగా బీజేపీకి ప్రజాదరణ పెరిగింది. అధికార ప్రాభవాన్ని పొందింది. మరి ఇప్పుడు అదే బీజేపీ ఫిరాయింపులను ప్రేరేపిస్తున్నది.


సత్యమేమిటంటే ప్రతిపక్ష పార్టీ స్థాయి నుంచి అధికార పక్ష స్థాయికి పురోగమించడంలో భారతీయ జనతా పార్టీ తాను శిరసావహించిన ఆదర్శాలకు తిలోదకాలు ఇచ్చింది. ఆ ఆదర్శాల స్ఫూర్తి ఇంకా ఏమైనా మిగిలి వుంటే ఇప్పుడు సంపూర్ణ అధికార సాధన ఆరాటంలో అణగారిపోతోంది. పార్టీ నాయకత్వం పూర్తిగా రాజీపడుతోంది. పార్లమెంటు, శాసనసభలు, చివరకు మునిసిపల్ కార్పొరేషన్లలో సైతం అంతకంతకూ పెరుగుతున్న బీజేపీ విజయాలు వాస్తవంగా మాజీ కాంగ్రెస్ నాయకులను తన పక్షంలోకి తీసుకోవడమేనని చెప్పవచ్చు. వీరందరూ కాషాయ పవనాలలో కాంగ్రెస్ నుంచి కమలం పార్టీలోకి వచ్చి పడ్డారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్, బీజేపీలో చేరక ముందు ఒక దశాబ్దం పాటు కాంగ్రెస్ శాసనసభ్యుడుగా ఉన్నారు. గోవా ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కావ్లేకర్ బీజేపీ తీర్థం పుచ్చుకునే ముందు వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కర్ణాటక మంత్రిమండలిలోని కనీసం పదిమంది ఒకప్పుడు కాంగ్రెస్‌లో వెలుగొందినవారే. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రిమండలిలోని ఆరుగురు పడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మంత్రులుగా ఉన్నారు. అస్సోంలో సర్వ శక్తిమంతుడైన మంత్రిగా పేరుపడ్డ హిమంత బిశ్వ శర్మ చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెర్మా ఖాండు కూడా బీజేపీలో ఆశ్రయం పొందక ముందు కాంగ్రెస్ నాయకుడే. ఇలా బీజేపీలో పదవీ వైభోగాలలో ఉన్న కాంగ్రెస్ నేతల జాబితా చాలా సుదీర్ఘమైనదే.


ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఒక స్థాయిలో ఇవి కాంగ్రె‍స్‌లో నెలకొనివున్న అంతర్గత సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. పార్టీ నుంచి వలసలను అరి కట్టలేని కాంగ్రెస్ నాయకత్వ నిస్సహాయతను అవి ప్రతిబింబిస్తున్నాయి. అయితే మరో స్థాయిలో అవి ‘కొత్త’ బీజేపీ అనైతిక ధోరణులను బాగా బహిర్గతం చేస్తున్నాయి. ప్రతి సంభావ్య అవకాశాన్ని ప్రత్యర్థులను పూర్తిగా అణచివేసేందుకు బీజేపీ ఉపయోగించుకుంటుందనే సత్యాన్ని అవి స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమ ంలో, ఒకప్పుడు ఉక్కు క్రమశిక్షణకు పేరు పొందిన బీజేపీ పార్టీ వ్యవస్థ ఇప్పుడు సైద్ధాంతిక నిబద్ధతను కోల్పోయే ప్రమాదంలో పడింది. నైతిక ప్రవర్తనను నిర్లక్ష్యం చేసి అవకాశవాదాన్ని ఆదరించినప్పుడు పరిస్థితులు భిన్నంగా ఎలా ఉంటాయి? ఈ అవాంఛనీయ ధోరణులపై పార్టీకార్యకర్తలు, నాయకులు అసంతృప్తి చెందుతున్నారు. పలువురు తమ భయాందోళనలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు.


మరీ ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలపై అధికార పక్షం ఇప్పుడు దాదాపుగా పూర్తిపట్టు సాధించింది. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకుగాను ఎన్నికల కమిషనర్ ఒకరిని మనీలాలోని ఒక అప్రాధాన్య పోస్ట్‌కు బదిలీ చేశారు. రిటైర్ అయిన కొద్ది నెలలకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకరికి రాజ్యసభ సభ్యత్వం లభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘సర్వతోముఖ ప్రతిభావంతుడు’ అని పొగిడిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు రాజకీయంగా వివాదాస్పదమైన కేసుల విచారణకు నేతృత్వం వహిస్తున్నారు. పార్లమెంటును ఒక నోటీస్ బోర్డ్ గా కుదించివేశారు. అధికరణ 370 రద్దు వ్యవహారమే ఇందుకొక ఉదాహరణ. ఇక అనేక మీడియా సంస్థలు చాలవరకు నిర్లజ్జగా ప్రభుత్వ మద్దతుదారుగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలావుండగా బీజేపీ తన ఉనికిని అంతకంతకూ విస్తరించుకొంటోంది. నిన్న మధ్యప్రదేశ్‌లో కేతనం ఎగురవేసింది. నేడు రాజస్థాన్‌లో పాగా వేసింది. రేపు ఏ ప్రతిపక్షం పాలనలో ఉన్న రాష్ట్రాన్ని స్వాయత్తం చేసుకోనున్నదో ఎవరికి తెలుసు?విరుద్ధ భావాలను విన్పించేందుకు, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు మన గణతంత్ర రాజ్యంలో ఇంకా ఏమైనా ఆస్కారమున్నదా? 

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2020-07-31T07:26:16+05:30 IST