చైనా విషయంలో చతికిల.. ఎంపీల గెంటివేతలో దూకుడు: అహ్మద్ పటేల్

ABN , First Publish Date - 2020-09-21T22:42:22+05:30 IST

విపక్ష ఎంపీలు 8 మందిని రాజ్యసభ నుంచి బహిష్కరించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు ..

చైనా విషయంలో చతికిల.. ఎంపీల గెంటివేతలో దూకుడు: అహ్మద్ పటేల్

న్యూఢిల్లీ: విపక్ష ఎంపీలు 8 మందిని రాజ్యసభ నుంచి బహిష్కరించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు అహ్మద్ పటేల్ తప్పుపట్టారు. చైనాను, కోవిడ్‌ను వెనక్కి గెంటేయలేని బీజేపీ ప్రభుత్వం రైతుల హక్కుల కోసం నిలబడిన 8 మంది ఎంపీలను మాత్రం తమ శక్తినంతా ఉపయోగించి సభ నుంచి బయటకు నెట్టేసిందని అన్నారు.


'బలవంతులమని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం చైనాను, కరోనా వైరస్‌ను తరిమికొట్టలేక పోయింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేకుంది. కానీ, 8 మంది ఎంపీలను మాత్రం తమ బలమంతా ఉపయోగించి గెంటేశారు. దీనికి కారణం ఏమిటంటే రైతు హక్కుల కోసం వారి పక్షాన ఎంపీలు నిలబడటమే' అని ఆయన అన్నారు. 


కాగా, పార్లమెంటరీ వ్యవస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఎంపీలను సభ నుంచి బహిష్కరించడం సిగ్గుచేటైన వ్యవహారమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. వారం రోజుల పాటు సభ నుంచి బహిష్కరణకు గురై, పార్లమెంటు వెలుపల నిరసన దీక్షలో కూర్చున్న 8 మంది ఎంపీలను అహ్మద్ పటేల్, సూర్జేవాలా తదితరులు కలుసుకుని సంఘీభావం తెలిపారు.

Updated Date - 2020-09-21T22:42:22+05:30 IST