‘మహా’ కౌన్సిల్‌ ఎన్నికల్లో బీజేపీకి షాక్‌

ABN , First Publish Date - 2020-12-05T07:48:12+05:30 IST

మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆరు స్థానాల్లో ఒక్క సీటు మాత్రమే ఆపార్టీ గెలుచుకుంది. అధికార శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ మహాకూటమి 4 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు...

‘మహా’ కౌన్సిల్‌ ఎన్నికల్లో బీజేపీకి షాక్‌

  • 4 స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం
  • కమలానికి ఒక్క సీటే 

ముంబై, డిసెంబరు 4: మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆరు స్థానాల్లో ఒక్క సీటు మాత్రమే ఆపార్టీ గెలుచుకుంది. అధికార శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ మహాకూటమి 4 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. ఈనెల ఒకటిన మూడు గ్రాడ్యుయేట్‌, రెండు ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. ఔరంగాబాద్‌, పుణె గ్రాడ్యుయేట్‌ స్థానాలను ఎన్సీపీ గెలుచుకుంది. బీజేపీకి బలమున్న నాగపూర్‌ గ్రాడ్యుయేట్‌ స్థానా న్ని కాంగ్రెస్‌  కైవసం చేసుకుంది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తండ్రి గంగాధర్‌ రావ్‌ ఫడణవీస్‌ గతంలో ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ధూలె-నందుర్‌బార్‌ లోకల్‌బాడీ సీటును మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది. శివసేన పోటీచేసిన ఒక్క స్థానంలోనూ ఓడిపోయింది. రాష్ట్రం లో రాజకీయ వాతావరణం మారిందని తాజా ఎన్నికల ఫలితాలపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ వ్యాఖ్యానించారు. కౌన్సిల్‌ ఎన్నికల్లో మహాకూటమి బలాన్ని తక్కువగా అంచనావేసినట్టు బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ చెప్పారు. 


Updated Date - 2020-12-05T07:48:12+05:30 IST